- 100 మందికిపైగా ప్రజల మృతి
- గత వారంలోనూ 4 స్కూళ్లపై అటాక్
- దాడుల్లో 62 మంది బలి
న్యూఢిల్లీ, ఆగస్టు 10: హిజ్బొల్లా, హమాస్ ముఖ్య నేతల హత్యల తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడం లేదు. తాజాగా తూర్పు గాజాలో శరణార్థులు ఆశ్రయం పొందుతున్న ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికిపైగా ప్రజలు మరణించగా వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. చాలా మంది గాయపడినట్లు పేర్కొంది.
ప్రజలు ప్రార్థనలు చేస్తుండగా ఈ అటాక్ జరిగిందని హమాస్ నేతృత్వంలో నడిచే గాజా ప్రభుత్వ మీడియా నివేదించింది. ఈ దాడిపై స్పందిస్తూ హమాస్ ఉగ్రవాదులు, కమాండర్లు రహస్యంగా పని చేస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌పై లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
4 పాఠశాలలపై దాడులు
గత వారంలో గాజాలోని 4 పాఠశాలలపై ఇలాంటి దాడులు జరిగాయి. ఆగస్టు 4న గాజాలో నిరాశ్రయులకు ఉంటున్న రెండు పాఠశాలలపై ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇందులో 30 మంది మరణించారు. అంతకుముందు రోజు గాజా నగరంలోని హమామా పాఠశాలపై చేసిన దాడిలో 17 మంది మరణించారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముఘ్రాబీ స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 15 మంది మరణించారు. పాఠశాలలను స్థావరాలుగా మార్చుకుని హమాస్ ఉగ్రవాదులు కమాండ్ కంట్రోల్ సెంటర్లను నిర్వహిస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అక్టోబర్‌లో హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపి 250 మందిని బందీగా పట్టుకోవడంతో యుద్ధం మొదలైంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.