40 మంది మృతి.. 60 మంది క్షతగాత్రులు
గాజా, సెప్టెంబర్ 10: కొంతకాలం నుంచి స్తబ్దుగా ఉన్న ఇజ్రాయెల్ మంగళవారం ఉదయం విజృంభించింది. ఇజ్రాయెల్ ఆర్మీ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మరో 60 మంది వరకు గాయపడ్డారు. ఖాన్ యూనిస్‌లోని హమాస్ కమాండ్ సెంటర్‌ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ‘అల్ మవాసీ’ ప్రాంతంలో ప్రస్తుతం 10 వేల మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం అప్పుడప్పుడు ఆ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్నది.
తాజాగా జరిగిన దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నాం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే దాడులు చేయడం అమానుషం. దాడుల్లో 20 నుంచి 40 గుడారాల వరకు దెబ్బతిన్నాయి’ అని గాజా సివిల్ డిఫెన్స్ అధికారి మహమ్మద్ అల్ ముఘైర్ ఓ మీడియాకు వెల్లడించారు. మరోవైపు దాడులు జరిగిన ప్రాంతంలో మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించడం శుద్ధ అబద్ధమని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది.