calender_icon.png 28 November, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్‌హెజ్బొల్లా సీజ్‌ఫైర్

28-11-2024 04:55:44 AM

  1. రెండు దేశాల మధ్య  కుదిరిన ఒప్పందం
  2. బుధవారం నుంచే అమల్లోకి
  3. ఎక్స్‌వేదిక బైడెన్ ప్రకటన
  4. భవిష్యత్తులో గాజాతోనూ ఒప్పందం?

న్యూఢిల్లీ, నవంబర్ 27: హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇజ్రాయెల్ లెబనాన్‌ల ప్రధానులతో తాను మాట్లాడినట్టు తెలిపిన బైడెన్.. విధ్వంసకర ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి అమెరికా చేసిన ప్రతిపాదనను వారు అంగీకరించారని వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

ఈ ఒప్పందం శాశ్వతంగా ఉండాలని బైడెన్ ఆకాంక్షించారు. 60 రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకోవాలసి ఉండగా ఇదే సమయంలో లెబనాన్ సైన్యం తమ సరిహద్దులోని భూభాగాన్ని నియంత్రణలోకి తీసుకుంటుందని తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం నుంచే అమలులోకి వచ్చిందనీ రానున్న రోజుల్లో గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు అమెరికా, టర్కీ, ఈజిప్ట్, ఖతర్ దేశాల నాయకులతో చర్చలు జరపనున్నట్టు చెప్పారు. 

మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. ఈ ఒప్పందం ఎంత కాలం కొనసాగుతుందనే అంశం లెబనాన్‌పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందాన్ని తాము ఉల్లంఘించబోమని స్పష్టం చేశారు. లెబనాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మాత్రం తమ ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

తమ సైనికుల క్షేమం, హమాస్‌ను ఒంటరిదాన్ని చేయాలనేది తమ ముఖ్య ఉద్దేశమని నెతన్యాహు ఈ సందర్భంగా తెలిపారు. “ ఆయుధాల పంపిణీలో పెద్ద జాప్యం జరిగిన విషయం రహస్యం కాదు. ఇది త్వరలోనే పరిష్కారమవుతాయి. మా సైనికుల క్షేమమే ముఖ్యం. మా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మరింతఅధునాత ఆయుధాల సరఫరాను అందుకోనున్నాం. యుద్ధం రెండో రోజు నుంచే హమాస్ పక్షాన పోరాడాలని హెజ్బొల్లా నిర్ణయించింది. హమాస్‌పై ఒత్తిడి తెచ్చి మా బందీలను విడిపించాలి” అని పేర్కొన్నారు. 

  1. పశ్చిమాసియాలో 
  2. శాంతి నెలకొంటుంది

ఇజ్రాయెల్ హెజ్‌బొల్లా మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంపై  భారత్ స్పందించింది. తాజా నిర్ణయంతో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ బుధవారం ప్రకటనను విడుదల చేసింది. ‘ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేం స్వాగతిస్తున్నాం.

ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చలు, దౌత్యపరమైన విధానాల ద్వారానే పరిష్కారం లభిస్తోందని మేం ఎప్పుడూ నమ్ముతాం. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం నెలకొంటాయని విశ్వాసిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు.