calender_icon.png 5 October, 2024 | 2:46 AM

ఇజ్రాయెల్ ఎంతోకాలం ఉండదు

05-10-2024 12:54:50 AM

అక్టోబర్ 7 ఘటనను సమర్థించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ 

ఖమేనీ ప్రసంగం తర్వాత ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు

ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డ ఉగ్రసంస్థ

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులు సరైన చర్యగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అభివర్ణించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మిస్సైల్ దాడులతో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ టెహ్రాన్‌లోని ఓ మసీదు వద్ద వేలాది మద్దతుదారులను ఉద్దేశించి శుక్రవారం ప్రసగించారు.

మేం మా శత్రువులను ఓడిస్తాం. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు, లెబనాన్ ఉద్యమా లకు మద్దతుకు నిలుస్తాం. ఇజ్రాయెల్ అమెరికా సాయంతోనే దేశంగా ఉంది. త్వరలోనే ఆ పేరుతో దేశమే ఉండదు. లెబనాన్, పాలస్తీనియన్లపై ఆక్రమణలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

మా నిరసనను అడ్డుకునే హక్కు ఏ అంతర్జాతీయ చట్టానికి లేదు. ఇజ్రాయెల్‌పై ప్రజాసేవ కోసమే దాడులు చేశాం. శత్రువుల కుట్రలను భగ్నం చేస్తాం. హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ విజయం సాధించలేదు. వారికి అండగా మేమున్నాం అని ఖమేనీ పేర్కొన్నారు. హెజ్బొల్లా అధినేత నస్రల్లా మృతిపైనా ఖమేనీ మాట్లాడారు. 

ఐదేళ్లలో మొదటి ప్రసంగం

ఇరాన్‌లో అత్యున్నత అధికారం చెలాయించే సుప్రీం లీడర్ గత ఐదేళ్ల కాలంలో తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా మరణించిన హెజ్బొల్లా నేతలకు సంతాపం ప్రకటించారు. నస్రల్లా మరణం చిన్న విషయం కాదని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తి తమతో ఎప్పటికీ ఉంటుందని, అతని మార్గంలో పనిచేస్తామని వెల్లడించారు.

నస్రల్లా బలిదానం తమపై మరింత బాధ్యత పెంచిందని, శత్రువులకు వ్యతిరేకంగా నిలబడాలని సూచించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు సరైనవేనని సమర్థించారు. 1985లో ఉపన్యాసం ఇస్తుండగా ఆత్మాహుతి బాంబు దాడి నుంచి ఖమేనీ సురక్షితంగా బయటపడ్డారు.

అప్పటినుంచి ఖమేనీ బహిరంగ ప్రసంగాలకు అరుదుగా హాజరవుతారు. అందుకే శుక్రవారం ప్రసంగం సందర్భంగా ఖమేనీ భుజాన ఏకేఛొ వేసుకున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసీం సులేమానిని అమెరికా హతమార్చిన అనంతరం ఖమేనీ చివరిసారిగా 2020 జనవరిలో మాట్లాడగా.. నస్రల్లా మరణం తర్వాత మళ్లీ మాట్లాడారు. 

ప్రసంగం తర్వాత దాడులు

ఖమేనీ ఉపన్యాసం ముగిసిన వెంటనే దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో ఉత్తర ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించినా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఇజ్రాయెల్ నివేదించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఖతార్‌లో సమావేశమైన అరబ్‌దేశాలు ఇరాన్ యుద్ధంపై తటస్థంగా ఉండాలని నిర్ణయించారు.

ఈ పరిస్థితుల్లో ఇరాన్ వెనక్కుతగ్గాలని కోరారు. ఇజ్రాయెల్ మద్దతుదారులు జోక్యం చేసుకుంటే మధ్యప్రాచ్యంలో వారి ప్రయోజనాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. మరోవైవు గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో 18 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని, ఇప్పటివరకు గాజాలో ఇదే అతిపెద్ద దాడిగా పేర్కొంటున్నారు. ఇటీవల గాజాలో జరిగిన దాడుల్లో హమాస్ నెట్‌వర్క్ హెడ్ జహీ యాసిర్ అబ్ధ్ అల్ రజాక్ మరణించినట్లు తెలుస్తోంది.       

నెతన్యాహు నా బాత్రూం వాడినప్పుడు..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓసారి తన వ్యక్తిగత బాత్రూంను ఉపయోగించారని, తర్వాత అందులో సీక్రెట్ రిసీవర్స్ అమర్చి ఉనట్లు గుర్తించామని బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన ఆరోపణలు చేశారు. తాను బ్రిటన్ విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పారు. త్వరలో విడుదల కానున్న తన పుస్తకం అన్‌లీష్‌డ్‌లోని ఈ సన్నివేశం గురించి బోరిస్ వెల్లడించారు.

అనుకోకుండా లేదా కావాలని చేసిందా తెలియదు కానీ, ఆయన బాత్రూం వెళ్లివచ్చాక సాధారణ తనిఖీల్లో తన సిబ్బంది ఆడియో డివైజ్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలన్నీ పుస్తకంలో వివరంగా పేర్కొన్నట్లు బోరిస్ తెలిపారు. గతంలోనూ వైట్‌హౌస్‌లో ఇజ్రాయెల్ ఇలాంటి పరికరాలు అమర్చినట్లు వార్తలు వచ్చాయి. 

మరో హెజ్బొల్లా నేత హతం

హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌లోని బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 37 మంది సహా హెజ్బొల్లా కమ్యునికేషన్స్ నెట్‌వర్క్ చీఫ్ మహ్మద్ రషీద్ సకాఫీ హతమైనట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. సకాఫీ  2000లోనే కమ్యునికేషన్స్ హెడ్‌గా నియమితులయ్యాడు. సకాఫీకి హెజ్బొల్లాలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంస్థ కార్యకలాపాల్లో సఖాఫీ కీలకంగా వ్యవహరించేవాడని ఇజ్రాయెల్ తెలిపింది. కాగా, ఈ దాడులతో పాటు హెజ్బొల్లాకు మరిన్ని సర్ ప్రైజులు ఇస్తామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాలంట్ వెల్లడించారు. ఇప్పటికే సంస్థ చీఫ్ నస్రల్లాను తుదముట్టించామని, కొత్త సమస్యలు కూడా వస్తాయని పేర్కొన్నారు. 

నస్రల్లా వారసుడిపై టార్గెట్

హెజ్బొల్లా అధినేత నస్రల్లా మరణంతో అతని వారుసుడిగా భావిస్తున్న హషీమ్ సైఫుద్దీన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ మేరకు లెబనాన్ బీరుట్‌లో మరో భారీ వైమానిక దాడిని ఇజ్రాయెల్ చేపట్టినట్లు తెలుస్తోంది. హషీమ్ ఓ సీక్రెట్ బంకర్‌లో హెజ్బొల్లా సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

ఈ దాడిలో హషీమ్ పరిస్థితి గురించి తెలియరాలేదు. నస్రల్లాకు హషీమ్ దగ్గరి బంధువు. అంతేకాకుండా హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 2017లో అతనిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, నస్రల్లా వారసుడిగా హషీమ్‌ను హెజ్బొల్లా ఎంచుకుందని వార్తలు వచ్చినా ఆ సంస్థ మాత్రం ఇప్పటికీ ధ్రువీకరించలేదు. కాగా, నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం లాంఛనంగా జరిగనట్లు హెజ్బొల్లా పేర్కొంది. 

ఇండియా మ్యాప్‌లో దిద్దుబాటు 

జమ్ముకశ్మీర్‌లోని కొంతభాగాన్ని పాక్‌లో ఉన్నట్లు చూపించే మ్యాప్‌ను విడుదల చేసిన ఇజ్రాయెల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు ఇజ్రాయెల్ ఉపక్రమించింది. భారత్‌లోని ఇజ్రాయెల్ దౌత్యవేత్త రూవెన్ అజార్ మాట్లాడుతూ.. ఆ మ్యాప్‌ను తొలగించామని, వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు వల్ల ఈ తప్పిదం జరిగిందని వెల్లడించారు.

ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతు తెలుపుతున్నా.. టెల్‌అవీవ్ ఆ విధంగా వ్యవహరిస్తుందా అని ఓ నెటిజెన్ ప్రశ్న లేవనెత్తగా రూవెన్ సమాధానమిచ్చారు. దీన్ని తమ దృష్టికి తెచ్చినం దుకు ధన్యవాదాలు అని తెలిపారు.