calender_icon.png 25 December, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇజ్రాయెల్ కొత్త యుద్ధం

20-09-2024 12:00:00 AM

పాలస్తీనా యుద్ధంలో ఇజ్రాయెల్  కొత్త వ్యూహాన్ని మొదలు పెట్టింది. నిన్న మొన్నటివరకు గాజా ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్‌కు మద్దతుగా నిలుస్తున్న లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హిజ్‌బొల్లాపై కొత్త యుద్ధం మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నది. దీంతో లెబనాన్ ఇప్పుడు అనూహ్య దాడులతో వణికిపోతున్నది.హిజ్‌బొల్లా ఉపయోగిస్తున్న వేలాది పేజర్లను పేల్చేసిన ఇజ్రాయెల్ ఆ మరుసటి రోజు ఆ సంస్థ ఉపయోగిస్తున్న వందలాది వాకీటాకీలనూ పేల్చేసింది.ఈ ఘటనల్లో ఇప్పటివరకు 32 మంది మరణించగా, వేలాదిమంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెలే ఈ దాడులకు దిగినట్లు భావిస్తున్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణమంత్రి ప్రకటన సైతం ఈ ఆరోపణలకు బలమిస్తోంది.‘ ఈ యుద్ధంలో కొత్త శకం మొదలైంది. దీన్ని మనమంతా అలవర్చుకోవలసిన అవసరం ఉంది’ అని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి హిజ్‌బొల్లాపై దాడులను ఆయన పరోక్షంగా అంగీకరించినట్లేనని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఇజ్రాయెల్ వ్యూహం వెనుక ఎంత పకడ్బందీ పథకం ఉందో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికతో మాట్లాడిన ముగ్గురు అమెరికా అధికారులు ‘టెల్‌అవీవ్’ ప్లాన్‌ను వివరించారు.

టెక్నాలజీ విషయంలో ఇజ్రాయెల్ సామర్థ్యం గురించి తెలిసిన హిజ్‌బొల్లా చీఫ్ నుస్రుల్లా  మొదటినుంచీ సెల్‌ఫోన్లకు దూరంగా ఉండేవాడు. లొకేషన్లు, ఇతర సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు పేజర్లను వాడే వాడు. అయితే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఇంటెలిజన్స్ ఎప్పుడో గ్రహించింది. ఎందుకైనా మంచిదని హంగేరిలోని బుడాపెస్ట్ కేంద్రంగా పేజర్ల తయారీకోసం ‘బీఏసీ కన్సల్టెంట్’ పేరుతో ఓ షెల్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత తైవాన్‌కు చెందిన ‘గోల్డ్ అపోలో’ బ్రాండ్‌ను వినియోగించుకుని పేజర్ల  విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది. సాధారణ కస్టమర్లకు మామూలు పేజర్లనే విక్రయించిన ఆ సంస్థ 2022లో తొలిసారి హిజ్‌బొల్లాకు కూడా స్వల్ప సంఖ్యలో విక్రయించింది.

మరోవైపు ఫోన్ల లొకేషన్ ఆధారంగా హిజ్‌బొల్లా సభ్యులను గుర్తించి దాడులు చేయడాన్ని ఇజ్రాయెల్ అలవాటుగా మార్చుకుంది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో హిజ్‌బొల్లా చీఫ్  బహిరంగంగా టీవీలో మాట్లాడుతూ ‘మీ వద్ద ఉన్న అన్ని ఫోన్లను ఐరన్ బాక్స్‌లో పెట్టి తాళం వేయండి’ అంటూ తన ఫైటర్లకు పిలుపునిచ్చాడు. హిజ్‌బొల్లా కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోను మొబైల్ ఫోన్లలో కమ్యూనికేట్ చేయవద్దని, పేజర్లను ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోవాలని స్పష్టంగా ఆదేశాలిచ్చాడు.

ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న ఇజ్రాయెలీ షెల్ కంపెనీ పేజర్ల తయారీని వేగవంతం చేసింది. బ్యాటరీల వద్ద ‘పీఈటీఎస్’ అనే పేలుడు పదార్థాన్ని అమర్చి తయారు చేయడం మొదలు పెట్టింది. ఈ ఏడాది వేసవిలో లెబనాన్‌లోకి భారీ సంఖ్యలో పేజర్లు వచ్చాయి. చివరికి అవే ఇప్పుడు లెబనాన్‌లో కల్లోలం సృష్టించాయి. అలాగే  ఇజ్రాయెల్ ఇంటెలిజన్స్ వ్యవస్థలోని ‘యూనిట్ 8200’ పేరుతో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ హిజ్‌బొల్లా వాకీటాకీలతో పాటుగా సౌరపరికరాలను ధ్వంసం చేయడం ద్వారా దాని కమ్యూనికేషన్ వ్యవస్థను చావుదెబ్బతీసింది.

అయితే ఈ కథనాలపై కానీ, హిజ్‌బొల్లాపై దాడుల గురించి కానీ ఇజ్రాయెల్  ప్రధాని కార్యాలయం లేదా రక్షణ విభాగం ఐడీఎఫ్ పెదవి విప్పలేదు. హమాస్‌ను ఇప్పటికే చావుదెబ్బతీసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దానికి మద్దతు ఇస్తున్న ఉగ్రవాద సంస్థలను కూడా ఓ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. కాగా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని లెబనాన్ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో లెబనాన్ సరిహద్దుల్లోకి ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని తరలిస్తున్నది. పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.