హమాస్ దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు వెల్లడి
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 13: గతేడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులతో ఇజ్రాయెల్ ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ అప్పట్లో భద్రతా అధికారులు దేశ ప్రజలకు క్షమాపణలు సైతం చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘యూనిట్ చీఫ్ యాస్సి సారిల్ రాజీనామా చేశారని ఇజ్రాయెల్ భద్రతా అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులను ముందుగా పసిగట్టి హెచ్చరికలు జారీచేయడం, ఉగ్రవాదులను నిలువరించడంలో ఇజ్రాయెల్ ఇంటిలిజెన్స్ విఫలం అయ్యిందని.. దీనికి బాధ్యత వహిస్తూ తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు సారిల్ వెల్లడించారు. ఇదే విషయ మై ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ మిలిటరీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహరోన్ హలీవా కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లో చేపట్టిన మెరుపుదాడుల్లో 1200 మంది పౌరులు చనిపోగా.. 250మందిని బందీలుగా తీసుకెళ్లారు. అయితే గాజాలో యుద్ధం ముగిసేవరకు అక్టోబర్ దాడులపై విచారణ ప్రారంభించవద్దని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ ఆదేశాలు జారీచేయడంతో అప్పట్లో అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.