అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వం
వాషింగ్టన్, ఆగస్టు 9: ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు కలిసి చర్చల ప్రకటన చేశాయి. కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలకు రావాలని ఇరుపక్షాలకు పిలుపునిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. ఈ చర్చల ప్రతిపాదనపై ఇజ్రాయెల్ స్పందించింది. ఈ నెల 15న కైరో లేదా దోహాలో చర్చలు జరిగొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. చర్చలకు తమ ప్రతినిధులను పంపుతామని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.
అయితే చర్చల ప్రతిపాదనపై హమాస్ వెంటనే స్పందించలేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని పటిష్ఠ భద్రత ఉన్న గెస్ట్‌హౌస్‌లోనే హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను హత్య చేయటంతో మధ్య ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించటం, ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా నేవీని పంపటంతో పరిస్థితులు జఠిలంగా మారాయి. దీంతో మొత్తం పరిస్థితిని చక్కదిద్దాలంటే ఘర్షణలకు మూలమైన ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలని మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు భావిస్తున్నాయి.