calender_icon.png 7 October, 2024 | 6:56 AM

దాడుల తీవ్రత పెంచిన ఇజ్రాయెల్

07-10-2024 01:42:24 AM

గాజాలో మసీదుపై దాడి.. 24 మంది మృతి

ఖుద్స్ చీఫ్ ఘనీ సైతం మరణించినట్లు అనుమానాలు

హమాస్ చీఫ్ తమతో టచ్‌లో లేరని ఖతార్ ప్రకటన

టెల్‌అవీవ్, అక్టోబర్ 6: హెజ్బొల్లాను పూర్తిగా తుదముట్టించాలనే లక్ష్యంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నా యి. ఆదివారం దాడుల తీవ్రతను మరింత పెంచింది. ఇజ్రాయెల్ వరుస వైమానిక, భూతల దాడులతో బీరుట్ చిగురుటాకులా వణికిపోతోంది.

నగరంలోని హెజ్బొల్లా కమాండ్ సెంటర్లు, అణుకేంద్రాలు, సొరంగాలు, మౌలిక సదుపాయాలు టార్గెట్‌గా దాడులు చేస్తోంది. సెంట్రల్ గాజాలో ఆదివారం ఓ మసీదుపై ఇజ్రాయెల్ దాడి చేసిం ది. డెయిర్ అల్ బలాలో అల్‌అక్సా అమరవీరుల ఆసుపత్రికి సమీపంలోని మసీదులో నిరాశ్రయులు ఉంటున్నారు.

ఈ మసీదుపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అక్టోబర్ 7 దాడుల నాటి నుంచి ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు గాజాలో దాదాపు 42 వేల మంది మరణించారు. 

ఖుద్స్ ఫోర్స్ చీఫ్ హతం!

విదేశాల్లో ఇరాన్ ఆపరేషన్లను నిర్వహిం చే ఖుద్స్ ఫోర్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. బీరుట్‌పై ఇజ్రాయెల్ ఇటీవల చేసిన వైమానిక దాడిలో ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిలీ ఘనీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే ఇజ్రాయెల్ సైన్యానికి కూడా పెద్ద షాక్ అని చెప్పవచ్చు. హెజ్బొల్లాకు సాయం చేసేందుకు ఇస్మాయిలీ బీరుట్‌కు వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఘనీ మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. 

హమాస్ చీఫ్ ఆచూకీ గల్లంతు?

అక్టోబర్ 7 దాడులకు ప్రధాన సూత్రధా రి, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారింది. ఆయన వారం రోజులు గా తమతో టచ్‌లో లేరని ఖతార్ అధికారు లు వెల్లడించారు. దీంతో ఆయన సజీవంగా ఉన్నారా? లేరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బందీల విడుదల విషయం లో ఇజ్రాయెల్, హమాస్‌కు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. కొంతకాలంగా ఉత్తరా లతో సంప్రదింపులు జరిపారని, ఇప్పుడు ఎలాంటి కాంటాక్ట్ లేదని ఖతార్ పేర్కొంది.

ఫ్రాన్స్‌పై ఇజ్రాయెల్ ఫైర్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులైన వేళ ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌కు ఆయుధ విక్రయాలను ఆపేయాలని ఫ్రాన్స్ అధ్యక్షు డు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ పిలుపునిచ్చారు. మేక్రాన్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకించారు.

ఇరాన్ నేతృత్వంలోని అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతున్నందున ప్రపంచం తమవైపు నిలవాలని, కానీ ఫ్రాన్ సహా ఇతర పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గతేడాది అక్టోబర్ 7న వేలాది మంది ఇజ్రాయెలీలు మరణించారని నెతన్యాహు గుర్తుచేశారు. 

దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడి 

ఇజ్రాయెల్‌లోని బీర్షెబా పట్టణంలో ఉగ్రదాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు కాల్పులు జరిపారని, ఈ దాడిలో ఒకరు మరణించగా 11 మంది గాయపడినట్లు తెలిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హంతకు డు సైతం హతమైనట్లు తెలిపారు.