సంకీర్ణ పక్షాలతో కలిసి అధికారంలోకి..
న్యూఢిల్లీ, నవంబర్ 11: జపాన్ పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో అత్యధిక ఓట్లు సాధించి దేశ ప్రధానమంత్రిగా తిరిగి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ప్రధానమంత్రిని ఎంపిక చేసేందుకు పార్లమెంట్ సోమవారం అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సంకీర్ణ ప్రభుత్వం తిరిగి ఇషిబాను ప్రధానిగా ఎన్నుకుంది.
ఈ క్రమంలో ఇషిబా.. ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ నేను జపాన్ 103వ ప్రధానమంత్రిగా నియమించబడ్డాను. దేశ ప్రజలకు సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తాను’ అని వెల్లడించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన రన్‌ఆఫ్ ఓటింగ్‌లో 67 ఏళ్ల ఇషిబా 221 ఓట్లను పొందారు. మ్యాజిక్ ఫిగర్ 233 ఉండగా ఇతర పార్టీలతో కలిసి మెజార్టీ సాధించి దేశ 103వ ప్రధానిగా ఎన్నికయ్యారు.