25-02-2025 02:11:21 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): “ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా..? ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రమాదం విషయం తేలకముందే ఎన్నికల ప్రచారమా? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా ? సీఎం రేవంత్‌రెడ్డీ ఇవేం దిగజారుడు రాజకీయాలు?” అంటూ సోమవారం ‘ఎక్స్’లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక ముఖ్యమంత్రికే దుర్ఘటనపై పట్టింపు లేకపోతే, ఇక యంత్రాంగానికి ఏం బాధ్యత ఉంటుందని దుయ్యబట్టారు.
ఓట్ల వేట కోసం జిల్లాలకు జిల్లాలు చుట్టి వచ్చేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది కానీ.. క్షతగాత్రుల కుటుంబీకుల ఆర్తనాదాలు పట్టించుకునేందుకు సమయం లేకపోయిందన్నారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా..? ప్రజాపాలన అంటే నోట్ల వేట.. ఓట్ల వేట మాత్రమేనా..’ అంటూ నిలదీశారు. టన్నెల్‌లో ఉన్నవారు బతికుండే అవకాశమే లేదంటూ సర్కారు చేతులెత్తేయడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సీఎంకు ఉంటుందని గుర్తుచేశారు.