calender_icon.png 8 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది.. గత పాలకవర్గం పాపమేనా..?

08-02-2025 12:00:00 AM

  • గజ్వేల్‌లో నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్ల విక్రయాలు
  • పాలకవర్గం ఉన్ననాళ్లు పట్టించుకోని అధికారులు 
  • విక్రయ దుకాణాలపై కొనసాగుతున్న దాడులు

గజ్వేల్, ఫిబ్రవరి 7 : ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, క్యారీ బ్యాగ్స్ ఏరివేత పై మున్సిపల్ అధికారులు నిద్రలేచారు. గత రెండు రోజుల నుంచి మున్సిపల్ అధికారులు  దుకాణాలలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు, ప్లేట్లు విక్రయిస్తున్న వ్యాపారులకు జరిమానాల విధిస్తూ, లైసెన్స్లను రద్దు చేస్తున్నారు. 

ఇటీవల పదవీకాలం పూర్తి అయిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం  ఎన్నికైన కొత్తలో మున్సిపల్ శాఖ ఆదేశాల మేరకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అధికారులు ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసుల విక్రయాల పట్ల కఠిన చర్యలు చేపట్టారు. అప్పట్లో జరిమానాలు  విధిస్తున్న అధికారి వ్యాపారుల నుండి  భారీగా మామూలు వసూలు చేయడంతో  ఆ అధికారిని సస్పెండ్ చేశారు.

ఆ తర్వాత పట్టణంలో యథేచ్చగా  ప్లాస్టిక్ విక్రయాలు కొనసాగుతూ వచ్చాయి. పాలకవర్గం అధికారంలో ఉన్నన్ని రోజులు ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్ల విక్రయాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనారం.

పాలకవర్గం పదవీకాలం పూర్తయిన కొద్ది రోజులకే  నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై  అధికారులు కఠిన చర్యలను కొనసాగిస్తున్నారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు,  విక్రయిస్తున్న వ్యాపారుల దుకాణాల లైసెన్స్ లు రద్దు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. 

ఇదే విధంగా అధికారులు కఠినంగా విధులు నిర్వహిస్తే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్లాస్టిక్ రహితంగా  మారుతుందని ప్రజలు భావిస్తున్నారు.