* ఒక్క కుటుంబం కోసం పోరాటమా!
* అసెంబ్లీలో బీఆర్‌ఎస్ తీరుపై అక్బరుద్దీన్ ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 20(విజయక్రాంతి): అసెంబ్లీలో శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తీరుపై ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ సభ్యులు అసెంబ్లీకి ప్రజల కోసం వచ్చారా? పార్టీ అధినేత కేసీఆర్ కు టుంబం కోసం వచ్చారా? ఎమ్మెల్యేలకు కేసీఆర్ నేర్పిన సంస్కృతి ఇదేనా? అంటూ ప్రశ్న ల వర్షం కురిపించారు. ప్రధాన ప్రతిపక్ష నేతల ప్రవర్తన చాలా చెత్తగా ఉందన్నారు. భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నానా హైరానా సృష్టించారన్నారు.
అక్బరుద్దీన్ మాట్లాడుతున్న సమయంలోనూ నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక దురదృష్టకరమైన రోజుగా అభివర్ణించారు. ఒక్క వ్యక్తి కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇంత హంగామా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాము ప్రజల కోసం అసెంబ్లీకి వస్తే.. వారు ఒక్క కుటుంబం కోసం పోరాటం చేయడానికి వచ్చారా? అని నిలదీశారు. ధరణిలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని ఒవైసీ ఆరోపించారు. ధరణిని ఒక కుటుంబం కోసం తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ధరణి పోర్టల్‌తో ప్రభుత్వానికి వేలకోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం కొత్త చట్టంతో రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వమైనా భూముల ఆడిటింగ్‌పై దృష్టి సారించాలన్నారు