03-04-2025 12:00:00 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకప్పటి వి ద్యార్థి నాయకుడే. అయినప్పటికీ రాష్ట్రంలో విద్యార్థులపై, వాళ్లు చేస్తున్న నిరసనలపై ఆయన ప్రభు త్వం, విశ్వ విద్యాలయాల ఉన్నతాధికారులు అనుసరిస్తున్న తీరు బాధాకరంగా ఉంది. విద్యార్థి నాయ కులు ఎందరో రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలి లో గుణాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన చరిత్ర మ నకు తెలుసు.
వాస్తవానికి విశ్వవిద్యాలయాలను బుద్ధిజీవులను, మేధావులను, దేశ భవిష్యత్తును ని ర్మించే కర్మగారాలుగా భావించాలి. పలు భావజాలాలు, పరిశోధనలకు, సమస్యలకు పరిష్కారాలను వెతికే కేంద్రంగా అవి ఉండాలి.
అయితే, ప్రగతి భవన్ కంచెలను తొలగించామని చెప్పుకున్న సీఎం రేవంత్‌రెడ్డి విశ్వవిద్యాలయాల్లో నిరసనలపై నిషేధం విధించడం మాత్రం ఏ మాత్రం సమంజసంగా లేదు. విశ్వవిద్యాలయాలు విద్యా ర్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాలని పైకి చెబుతూనే కిందిస్థాయి అధికారుల ద్వారా వారి నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో యూనివర్సిటీల్లో అసలు ప్రశ్నిం చే అవకాశమే లేకుండాపోతున్నది. విశ్వవిద్యాలయాల్లో సమస్యల పరిష్కారానికే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారనే కోణంలో ఆలోచించడంలో ప్రభుత్వం విఫలమవుతున్నట్టు అనిపిస్తున్నది.
ఆంక్షలు అవసరమా?
సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాలను సందర్శించి ఆనాటి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. తాము అధికారంలోకి వస్తే విద్యార్థులపై ఎటువంటి ఆంక్షలు ఉండ బోవని, విశ్వవిద్యాలయాల్లో అన్ని రకాల వసతులతోపాటు అధ్యాపకులనూ తగినంతంగా నియమిం చి పరిశోధనలకు కావాల్సిన నిధులను కేటాయి స్తామని ఆయన హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పటి ఆ యన తీరు దీనికి భిన్నంగా కనిపిస్తున్నది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అనేక సామాజిక మార్పులకు మూల కారణం విశ్వవిద్యాలయాలే. తెలంగాణ రాష్ట్రం సాకారం మొదలు, నేడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేవరకు అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించింది వర్సిటీల విద్యార్థులే.
కానీ, ఆయన నాయకత్వంలోని నేటి ప్రభుత్వం వారి ఉద్యమాలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనలపై ఆంక్షలు పెడుతూ, ధర్నాలపై, సామూహిక సమావేశాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు విడుదల చేశారు. ఈ రకంగా విద్యార్థుల్లోని ప్రశ్నించే తత్వాన్ని అణచి వే యాలనుకోవడం అన్యాయం.
సమస్యలకు నిలయంగా..
జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల యం కూడా సమస్యల నిలయంగా మారింది. వ సతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపో గా, కొన్ని డిపార్ట్‌మెంట్‌లకు తరగతి గదులైనా లేవు. వాస్తవానికి ఇటువంటి సమస్యలను సైతం పరిష్కరించాలని అడిగే అవసరమే ఉండకూడదు. అధికా రులే ముందుకొచ్చి వీటిని పరిష్కరించాలి.
సంవత్సరాల తరబడి సమస్యలు అపరిష్కృతంగా ఉంటు న్నందున విద్యార్థులు ముందుకొచ్చి అధికారులను కోరే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక వినతి పత్రాలు ఇచ్చారు. అయినా పరిష్కారం లభించనందున శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి విద్యార్థులపై విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులు పని కట్టుకుని మెమోల పేరుతో హెచ్చరిస్తున్నారు. విద్యార్థులపై పోలీస్ కేసులు పెడుతున్నారు.
ప్రభుత్వం పునరాలోచించాలి
హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా అనేక జీవరాశులకు, జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విషయంలో ప్రభుత్వం, పోలీసులు అనుసరిస్తున్న తీరు నిజంగా ఆందోళనకరం. సామాజిక మాధ్యమాల్లో హెచ్‌సీయూలోని దృశ్యాలను చూసినట్లయితే విశ్వవిద్యాలయంలోకి పోలీసులు వచ్చారా? లేకపోతే, పోలీస్ స్టేషన్‌లోనే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయా న్ని ఏర్పాటు చేశారా? అనే సందేహం వస్తుంది.
యూనివర్సిటీలు పరిశోధనలకు, చర్చావేదికలకు కేంద్రంగా ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కారణంగా విశ్వవిద్యాలయాలు గురువులు, విద్యార్థులతో కాకుండా పోలీసులతో దర్శనమిస్తున్నాయి.
పోలీసులు ప్రవేశించి విచక్షణా రహితంగా లాక్కెళ్లి విద్యార్థులను అరెస్ట్ చేయడం ఎంత వరకు న్యాయం? ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. హెచ్‌సీయూ భూముల విషయంలో పునరాలోచించాలి. తమ ఆలోచనను విరమించుకోవాలని తెలంగాణ విద్యార్థి సమాజం డి మాండ్ చేస్తోంది.
అంతేకాకుండా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు ముఖాముఖి సమావేశాలు జరిగేలా చొరవ చూపా లి. విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు.
జవ్వాజి దిలీప్ 7801009838