calender_icon.png 23 October, 2024 | 7:10 AM

ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పు లేనట్టేనా?

11-07-2024 12:09:32 AM

  1. రాయిగిరి భూములపై స్టే తొలగింపునకు కౌంటర్ వేయాలని కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ఆదేశం 
  2. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు

యాదాద్రి భువనగిరి, జూలై 10 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి మరో మణిహారంగా ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో భాగంగా యాదాద్రి భువనగిరిలోని రాయిగిరి రైతులు భూములను నష్టపోవాల్సి వస్తోంది. రాయిగిరి రైతులకు న్యాయం చేయడానికి అలైన్‌మెంట్ మార్చాలని భువనగిరి, వలిగొండ మండలాల రైతులు చేసిన ఆందోళనలు ఫలించనట్టే కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయడం లేదన్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో బుధవారం జరిపిన సమీక్ష సమావేశంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన మేరకు అలైన్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు లేకుండానే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయను న్నట్టు స్పష్టమవుతోంది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏ) రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లతో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో యాదాద్రి భువనగిరి జిల్లా లో జాప్యం జరుగుతున్న అంశం చర్చకు వచ్చిన సందర్భంగా, జిల్లాలోని భువనగిరి మండలం రాయిగిరి రైతులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారని కలెక్టర్ హనుమంతు కే జండగే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి స్టే తొలగింపునకు శుక్రవారం నాటికి కౌంటర్ సిద్ధం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

ఇప్పటికే భూములు కోల్పోయామంటున్న రైతులు

రాయిగిరి గ్రామంలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఒక్కో రైతు రెండు, మూడుసార్లు తమ విలువైన భూములను కోల్పోయారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సైతం రాయిగిరి వద్ద సర్కిల్ ఏర్పాటు ప్రతిపాదనలతో మరోసారి పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి వస్తోంది. దీంతో గ్రామస్థులు తమకు నష్టం జరగకుండా అలైన్‌మెంట్ మార్చాలని రెండున్న రేళ్లుగా ఆందోళనలు చేశారు. నిరాహార దీక్షలు, కలెక్టరేట్ ముట్టడి వంటి పోరాటాలు చేపట్టారు. చివరకు హైకోర్టును ఆశ్రయించి తమ భూముల సర్వే జరపకుండా స్టే ఉత్తర్వులు పొందారు.

అయితే, ఈ ఆందోళనలకు అప్పటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మద్దతుగా నిలిచి అలైన్‌మెంట్ మార్పు చేయిస్తామని చెప్పారు. అప్పటి భువనగిరి ఎంపీ, ప్రస్తుత రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా అలైన్‌మెంట్ మార్పులు, చేర్పులు చేసి న్యాయం చేస్తామని రైతులను స్వయంగా కలిసి భరోసా కల్పించారు. అయితే, రైతులు అదే నమ్మకంతో తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నారు. అయితే, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్టే ఉత్తర్వుల రద్దుకు కౌంటర్ వేయాలని కలెక్టర్‌ను ఆదేశించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.