calender_icon.png 1 October, 2024 | 5:10 AM

కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా

01-10-2024 02:52:05 AM

దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచండి

  1. లడ్డూ శాంపిల్స్‌ను పరీక్షలకు ఎందుకు పంపలేదు?
  2. ఆధారాలు లేనిదే ప్రకటనలు ఎందుకు?
  3. మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరమేముంది?
  4. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి లో కల్తీ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపణలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు రుజువులు లేకుండా ప్రజల మధ్య ఆరోపణలు ఎలా చేశారని ప్రశ్నించింది.

కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగింది. ఒకవేళ ఆధారాలు ఉంటే లడ్డూ శాంపిల్‌ను పరీక్షల కోసం ఎందుకు పంపలేదని నిలదీసింది. లడ్డూ వ్యవహారంపై విచారణకు ఆదేశించినప్పుడు మీడియా ముందుకు వెళ్లా ల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కనీసం దేవుళ్లను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది.

రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయాల నుంచి మతాన్ని వేరుగా ఉంచాలని సూచించిన న్యాయస్థానం.. కేసు నమోదు చేయడానికి లేదా సిట్ ఏర్పాటు చేసేముందే సీఎం చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారని పేర్కొంది. సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 26న సిట్ ఏర్పాటు చేశారని..

అంతకుముందే సెప్టెంబర్ 18న చంద్రబాబు లడ్డూ కల్తీపై ఆరోపణలు చేసినట్లు కోర్టు పేర్కొంది. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి, రాజ్యసభ ఎంపీ, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చరిత్రకారుడు విక్రమ్ సంపత్, ఆధ్యాత్మికవేత్త దుష్యంత్ శ్రీధర్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుమారు గంటపాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. 

ముందే ప్రకటనలు ఎందుకు?

లడ్డూ కల్తీ వివాదంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథ్‌తో కూడిన డివిజన్ బెంచ్ మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేలా ఇలాంటి ప్రకటన చేసి ఉండాల్సి కాదు. విచారణకు ఆదేశించినప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న ఉన్నత వ్యక్తి ఎలాంటి సమాచారమైనా ప్రజలకు తెలియజేయడం సరికాదని మేం భావిస్తున్నాం.

మీరు సిట్‌ను ఏర్పాటు చేశారు. వివరాలు ఏంటో తెలిసే వరకు మీడియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? మీరు గతంలోనూ ఇలాగే చేశారు. ఇది రెండోసారి అని ఏపీ ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ధర్మాసనం తెలిపింది. ధర్మాసనం వ్యాఖ్యలపై రోహత్గీ స్పందిస్తూ.. ఇవన్నీ నిజమైన పిటిషన్లు కావని, ప్రస్తుత ప్రభుత్వంపై గత పాలకులు చేసే దాడిగా అభివర్ణించారు. సుబ్రమణ్యస్వామి, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు ఒకే రకంగా ఉన్నాయని తెలిపారు. ఎలాంటి పదార్థాలు సరఫరా చేశారో చెప్పాలని వాళ్లకు ఇప్పటికే టీటీడీ షోకాజ్ నోటీసులు పంపిందని గుర్తుచేశారు.  

అప్పుడెందుకు ల్యాబ్‌కు పంపలేదు?

ఈ నేపథ్యంలో లడ్డూ తయారీలో కలుషిత నెయ్యి ఉపయోగించారని రుజువు ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు కల్తీ నెయ్యి వాడినట్లు ఏ నివేదిక నిర్ధారించలేదని కోర్టు పేర్కొంది. టీటీడీ సీఈవో కల్తీ నెయ్యి ఉపయోగించలేదని చెబుతుంటే.. సీఎం మాత్రం కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారని, ఇద్దరి ప్రకటనల్లో పొంతన లేదని మండిపడింది.

దీనిపై న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మాట్లాడుతూ.. లడ్డూ రుచిగా లేదని భక్తులు ఫిర్యాదు చేశారని కోర్టు తెలియజేశారు. రెండు ట్యాంకర్లను ఎన్‌డీడీబీకి టెస్టింగ్ కోసం పంపామని చెప్పారు. జూన్ నుంచి సరఫరాదారుగా ఉన్న వ్యక్తి జూలై 4 వరకు టెస్టింగ్‌కు పంపలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. రుచిలో తేడా వచ్చినప్పుడు కలుషిత పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ల్యాబ్‌కు పంపారా? అని ప్రశ్నించింది. 

రెండో అభిప్రాయం తీసుకోవాల్సింది..

విచారణలో భాగంగా జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. ల్యాబ్ రిపోర్టులో కొన్ని అంశాలు అనుమతించినట్లుగా లేవు. రిపోర్టు సైతం స్పష్టంగా లేదు. జూలైలో నివేదిక వస్తే.. సెప్టెంబర్ 18న బహిరంగంగా ప్రకటన చేశారు. మీకు కచ్చితంగా తెలియకపోతే ఎందుకు మాట్లాడారు? అని ప్రశ్నించారు. లడ్డూల తయారీలో అదే నెయ్యి వాడారా? అని జస్టిస్ గవాయి ప్రశ్నించగా.. ఈ విషయంలో విచారణకు ఆదేశించామని న్యాయవాది లూథ్రా సమాధానమిచ్చారు.

దీంతో ఆగ్రహించిన కోర్టు.. రుజువులు లేనప్పుడు రెండో అభిప్రాయం తీసుకోవాలనే వివేకం లేదా అని మండిపడ్డారు. నెయ్యి ఉపయోగించినట్లు రుజువు కాలేదు.. మరోవైపు రెండో అభిప్రాయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై విచారణకు సిట్‌ను కొనసాగించాలా? లేదా వేరే ఏజెన్సీకి బదిలీ చేయాలా? అనేది తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం అడిగింది.

కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల ప్రారంభంలో ఆరోపించగా రాజకీయ వివాదానికి దారి తీసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందింస్తూ.. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు హీనమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.      

ఇది కాఫీ షాప్ కాదు: సీజేఐ

ఓ కేసు విచారణలో భాగంగా న్యాయవాది ఇంగ్లీష్‌లో పదేపదే యా..యా (అవును) అని సమాధానం ఇవ్వగా సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం వేశారు. ఇలాంటి సంక్షిప్త, క్యాజువల్ సమాధానాలు తనకు అలర్జీ అని పేర్కొన్నారు. న్యాయవాదిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు కేఫ్‌లో కాకుండా కోర్టు హాలులో ఉన్నారని గుర్తుచేశారు.

యా అనే పదం గౌరవప్రదమైనది కాదని, దాన్ని కోర్టులో ఉపయోగించవద్దని సూచించారు. అలాంటి పదాలను వాడేందుకు ఎప్పటికీ అనుమతించమని స్పష్టం చేశారు. 2018లో సుప్రీంకోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈ ఘటన జరిగింది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడే ఆర్టికల్ 32 అంశానికి సంబంధించిన పిటిషన్‌పై ఈ ఘటన జరిగింది.

ఈ కేసులో ప్రతివాదిగా మాజీ సీజేఐ రంజన్ గొగొయిని కూడా పిటిషనర్ చేర్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి కేసుల్లో మాజీ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తి పేరును ఎలా చేర్చారని ప్రశ్నించారు. వెంటనే ఆ పేరును తొలగించాలని సీజేఐ కోర్టు రిజిస్ట్రీని ఆదేశించగా మరోసారి లాయర్ స్పందిస్తూ గతంలో ధర్మసనం ఈ పిటిషన్లను డిస్మిస్ చేశాయని, అందుకే మాజీ సీజేఐ పేరు చేర్చామని వెల్లడించారు. 

సాగదీస్తే లాయర్లకే లాభం : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ 

ఢిల్లీ, సెప్టెంబర్ 30: విడాకుల విషయంలో సుదీర్ఘ న్యాయ పోరాటం వల్ల న్యాయవాదులకే ప్రయోజనం చేకూరుతుందని, దానికి బదులు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకోవాలని ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దంపతుల మధ్య వివాదానికి సంబంధించిన కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ఓ మహిళ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సోమవారం విచారణ చేపట్టారు. సదరు మహిళ విద్యార్హతలను అడగగా, తాను ఎంటెక్ పూర్తిచేశానని, అమెరికాలోని ఓ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగం చేయడం లేదని ఆమె వివరించారు.

సీజేఐ స్పందిస్తూ.. ‘మీరు ఈ కేసులో పదేళ్లయినా న్యాయ పోరాటం చేయగలరమో గానీ దాని వల్ల న్యాయవాదులకే ప్రయోజనం. పరస్పర సమ్మతితో విడాకులు తీసుకునేందుకు మీరెందుకు అంగీకరించకూడదు? మీరు నిరక్షరాస్యులైతే కేసు వేరేగా ఉండేది. కానీ మీరు చదువుకున్నారు. ముందు మంచి ఉద్యోగాన్ని సంపాదించండి’ అని మహిళకు సూచించారు.