calender_icon.png 21 March, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ కళాశాల ఏర్పాటు కలేనా?

21-03-2025 02:05:17 AM

  • ఏండ్లుగా  కొండమల్లేపల్లి విద్యార్థుల నిరీక్షణ 
  • ఆర్థిక భారంతో చదువులకు దూరమవుతున్న పేదలు  
  • త్వరగా ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్ 

దేవరకొండ, మార్చి 20 : కొండ మల్లేపల్లి మండల కేంద్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. అయితే అందుకు తగ్గట్టుగా మండల కేంద్రంలో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో కొండమల్లేపల్లిని మండలంగా ఏర్పాటు చేసింది.

ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రతి సంవత్సరం దాదాపుగా 800 నుంచి 1000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతున్నారు. మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడంతో దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్ వెళ్లి వేలకు వేల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కాలేజీల్లో చదివించాల్సి వస్తుంది.

డబ్బులు కట్టలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువు ఆపేసే దుస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు చదువుకు దూరమై స్థానికంగా షాపుల్లో కూలీలుగా, గుమస్తాలుగా పనిచేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కొండమల్లేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

 కర్ణకంటి రజినీకాంత్

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కొండమల్లేపల్లిలో జూనియర్ కళాశాల ఏర్పాటు కావడం లేదు. గుడిపల్లి, గుర్రంపోడు మండలాల నుంచి చాలామంది ఇక్కడే పదో తరగతి చదువుతున్నారు. కొండమల్లేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి.

 - తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్,  దేవరకొండ కన్వీనర్