calender_icon.png 30 March, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెజరీలో వసూళ్ల దందా?

27-03-2025 01:50:33 AM

  1. ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందే
  2. ఫిబ్రవరి, మార్చి నెలలపై  సిబ్బంది గురి
  3. విలవిల్లాడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
  4. సబ్ ట్రెజరీల్లోనూ భారీగానే వేధింపులు

సూర్యాపేట, మార్చి26(విజయక్రాంతి): ‘ఖజానా’ కార్యాలయాల్లో  అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నదనే ఆరోపణలు బహిరంగానే వినబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే అంటున్నారు.

వివిధ శాఖలకు చెందిన బిల్లులకు, ఉద్యోగులకు వర్తించే వివిధ ప్రయోజనాలపై టార్గెట్లు పెట్టి మరీ ట్రెజరీలో దోచుకుంటున్నారని పలువురు అంటున్నారు.  చేయి తడపనిదే ఇక్కడ ఏ పనీ కాదు. ఫైలు ముందుకు కదలదు. డబ్బులు ఇవ్వలేదో ఫైళ్లు తొక్కిపెట్టడం, కొర్రిలు పెట్టి నెలల తరబడి తిప్పించుకోవడం పరిపాటిగా మారిందనేది జగమెరిగిన నిజం. ప్రస్తుతం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది.

వార్షిక ఆదాయ పన్నుకు సంబంధించిన క్లెయిమ్స్ కోసం కోశాధికారి కార్యాలయానికి వెళ్తే ఫైల్కు ఒక రేటు చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాలో వివిద పనులకు  వినియోగించిన బిల్లుల మంజూరుకు చేతులు తడపవలసి వస్తోందని వాపోతున్నారు. తప్పనిసరై ఎస్టీవోల్లో ట్రెజరీ ఉద్యోగులు అడిగిన కాడికి చేతులు తడిపి పని చేయించుకుంటున్నారు. లేదంటే ఐటీ క్లెయిమ్స్ ఇబ్బందులు తలెత్తుతాయని, ఫిబ్రవరికి సంబంధించిన జీతాలు నిలిచిపోతాయనే భయంతో సొమ్ము ముట్టజెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని కొందరు ఉద్యోగుల గుసగుసలాడుతున్నారు. 

కలెక్టరేట్లకు వచ్చినా అంతేనా..

గతంలో ట్రెజరీ కార్యాలయాలు ఎక్కడో విసిరేసినట్లుగా ఉండేవి. దీంతో సిబ్బంది ఆడిందే ఆటం పాడిందే పాట అన్నట్లుగా ఉండేది.  సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తరువాత  అన్ని శాఖలను ఒకే గూటి కిందకు చేర్చారు. ప్రైవేటు బిల్డింగ్లలో, ప్రభుత్వ ప్రాంగణాల్లోనే ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే ట్రెజరీ ఆఫీసులను సైతం తీసుకొచ్చి సమీకృత కలెక్టరేట్లోనే ఆఫీసులను కేటాయించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారుల చెంతనే ఖజానా శాఖకు సైతం స్థానం కల్పించడంతో అవినీతి, అక్రమాలు అదుపు చేయొచ్చని భావించింది. పర్యవేక్షణ పెరగడంతో గతంలో లంచాలు అడగాలంటే ఉద్యోగులు భయపడే వారు. కానీ ఇప్పుడు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోయింది.

ఉద్యోగులపై ఉద్యోగుల వేధింపులు..

ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు జిల్లా ట్రెజరీ కార్యాలయం గుండె కాయ వంటిది. ఒక్క పైసా విడుదల కావాలన్నా సంబంధిత అధికారులు నిబంధనలకు అనుగుణంగా మంజూరు చేస్తారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేసిన వ్యయాలకు బిల్లులు సమర్పిస్తే అందుకు అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేయడం పరిపాటి. కానీ జిల్లా కోశాధికారి కార్యాలయం, జిల్లాలోని ఎస్టివో కార్యాలయల్లో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

నిత్యం ప్రజల అవసరాలను తీరు స్తూ బాధితుల కష్టనష్టాలను తీర్చే పలు శాఖ ల అధికారులే.. ట్రేజరీ అధికారులకు బాధితులుగా మారుతున్నారనే ఆరోపణలు వస్తు న్నాయి.  2024  25 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో రావాల్సిన బిల్లులకు ట్రెజరీ ద్వారా మంజూరు చేసుకునేం దుకు శాఖలన్నీ బిల్లులు సమర్పిస్తుండగా పర్సెంటేజీల దందాతో ప్రభుత్వ శాఖల అధికారులు కంగు తింటున్నారు. చిన్నపాటి లోటుపాట్లను ఆసరా చేసుకుంటున్న ట్రేజరీ సిబ్బంది బిల్లులు ఇలా సమర్పించగానేం అలా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. జీపీఎఫ్, గ్రాట్యూటీ, ఈఎల్స్, చివరకు మెడికల్ రీయింబర్స్మెంట్లకు సమర్పించిన బిల్లులకు సైతం పర్సంటే జీలు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు.. రవికుమార్, డీటీవో

ప్రభుత్వ ఉద్యోగులు ఎవ్వరికీ డబ్బులు ఇవ్వాల్సిన అసవరం లేదు. కచ్చితమైన బిల్లులు సమర్పించి జీతాలు, ఇతర బిల్లులు  పొందవచ్చు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే మా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం.