calender_icon.png 21 November, 2024 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరులో కారు దారెటు?

21-11-2024 01:42:04 AM

  1. పార్టీ మారిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి 
  2. మొహం చాటేస్తున్న గులాబీ ముఖ్య నేతలు 
  3. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నేతలు విఫలం
  4. నడిపించే నాయకుడి కోసం ఎదురుచూపులు
  5. ఇంచార్జి పదవి కోసం హరీశ్ చుట్టూ ప్రదక్షిణలు!
  6. నియోజకవర్గంలో పట్టుకోల్పోతున్న బీఆర్‌ఎస్?

సంగారెడ్డి, నవంబర్ 20 (విజయక్రాంతి) : పటాన్‌చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. శాసనసభ ఎన్నికల్లో గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్లలో దర్జాగా తిరిగిన నాయకులు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కనిపించకుండా పోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే నాయకుడే లేకుండా పోయాడని చర్చించుకుంటున్నారు. ప్రజల ప్రక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పటాన్‌చెరు బీఆర్‌ఎస్ నేతలు సైలెంట్‌గా ఉన్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాల్సిన నేతలు బయటకు వచ్చేందుకు కూడా అలోచిస్తున్నారని పలువురు చర్చించుకుంటు న్నారు. ఆసియా ఖండంలోనే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన పటాన్‌చెరు గులాబీ పార్టీ(బీఆర్‌ఎస్)కి కంచుకోటగా ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది.

దీంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో సంగారెడ్డి నుంచి విడిపోయి 2009లో పటాన్‌చెరు నియోజకవర్గం ఏర్పాటయ్యింది. జిన్నారం, పటాన్ చెరు, రామచంద్రాపురం, గుమ్మడిదల మండలాలు ఈ నియోజకవర్గంలోకి రాగా.. తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఇందులో ఉన్నా యి.

అయితే రాంచంద్రాపురం, పటాన్‌చెరు, భారతినగర్‌లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. 2009లో నందీశ్వర్‌గౌడ్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన్నారు. 2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన పార్టీ మారడంతో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

గులాబీ కోటకు బీటలు..

బీఆర్‌ఎస్ పార్టీకి పటాన్‌చెరు నియోకవర్గం కంచుకోటగా ఉండేది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడి గులాబీ కోటకు బీటలు పడుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు అయోమ యంలో పడ్డారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానలో గెలుపొందడం ఖాయమని పలువురు పేర్కొంటున్నారు. 

పార్టీ ఇంచార్జి పదవి ఎవరికో?

గ్రేటర్ హైదరాబాద్‌లో పదేళ్లుగా బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో పరిస్థితులు మారుతున్నాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి హస్తం గూటికి చేరడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది.

పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ పార్టీకి మంచి పట్టు ఉండడంతో ఆదర్శరెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, తెలంగాణ ఉద్యకారుడు వెంకటేశం, మెట్టు కుమార్, గుమ్మడిదలకు చెందిన గోవర్ధన్‌రెడ్డి పార్టీ ఇంచార్జి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీని కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం.