calender_icon.png 25 November, 2024 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆమెరికాలో మహిళలకు శ్వేతసౌధం దూరమేనా?

24-11-2024 12:00:00 AM

సుమారు రెండున్నర శతాబ్దాలుగా అగ్రరాజ్యమైన అమెరికాలో ఒక్క పర్యాయమైనా అధ్యక్ష స్థానాన్ని ఒక మహిళ గెలుచుకోలేకపోయారంటే, ఇంతకంటే విచారకర స్థితి మరొకటి ఉండదు. రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అధ్యక్ష పదవిని గెలుచుకోగా, ఒక ప్రముఖ మహిళా అభ్యర్థి ఓడి పోవడం బాధాకరమే. ట్రంప్ 2016లో మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్‌ను ఓడించారు. ఇప్పుడు ఉపాధ్యక్షు రాలు కమలా హారిస్‌ను కూడా ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చారు.

ఆశ్చర్యకరంగా దాదాపు 250 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఆ దేశప్రజలు ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా ఎన్నుకోలేకపోయారు. ఆకాశంలోనేకాదు, అమెరికా జనాభాలోనూ సగం మంది తరఫున ఒక్క మహిళా ప్రతినిధికి అయినా నేటివరకు ‘ఓవల్ ఆఫీస్’ (యుఎస్ అధ్యక్షుడి కార్యనిర్వాహక కార్యాలయంలో భాగం) లో ప్రాతినిధ్యం లేకపోవడం.. మహిళా ప్రపంచానికి పెద్ద లోటుగానే భావించా లి.

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాలలో పురోగతి సాధిస్తున్నప్పటికీ రాజకీయ పరంగా పూర్తి స్థాయి విజయాలను కైవసం చేసుకోలేకపోతున్నారన్నది నిజం. దీనికి కారణాలు, అనేకం. ఒక్క అగ్రరాజ్యంలోనే కాదు, మరోవైపు ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలి లోని ఐదు శాశ్వత సభ్యదేశాలలో నాలు గు -(చైనా, రష్యా, ఫ్రాన్స్, యుఎస్) దేశాలలోనూ మహిళలకు అత్యున్నత పదవి (అధ్యక్షులుగా)కి అవకాశం రాకపోవడం గమనార్హం.

చైనాలో అయితే, పాలక కమ్యూనిస్ట్ పార్టీకి అత్యంత శక్తివంతమై న సంస్థగా చెప్పే ‘పొలిట్ బ్యూరో స్టాం డింగ్ కమిటీ’లో సైతం ఇంతదాకా ఒక్క మహిళ కూడా లేరు. ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ఆర్థిక శక్తి వనరుగా చెప్పుకొనే  జపాన్‌లో కూడా ఇంతవరకు ఒక మహి ళా ప్రధానమంత్రిని ఎన్నుకోలేదు. ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన దేశాల లో మహిళలు అత్యున్నత పదవులను అలంకరించలేక పోతుండడానికి ప్రధాన కారణం.. వారు పురుషులతో సమానం గా పోటీ పడలేక పోతుండడమేనా?

ఇది ఆయా దేశాల ప్రజలు ఆలోచించవలసిన విషయం. ఐతే, దీనికి భిన్నంగా, ప్రభావవంతమైన కార్యాలయాలకు మహిళా నాయకులను ఎన్నుకునే విషయంలో ముఖ్యంగా దక్షిణాసియా ప్రాం తాన్ని ఒక గొప్ప ఉదాహరణగా చెప్పాలి. అప్పటి సిలోన్‌లో సిరిమావో బండారు నాయకే నుంచి భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ వరకు, పాకిస్తాన్‌లోని బెనజీర్ భుట్టో వరకు, బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా వాజెద్, బేగం ఖలీదా జియా వరకు.. ఇంకా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాలలో ఇండోనేషియా, ఇజ్రాయెల్, థాయిలాండ్, దక్షిణ కొరియాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించడం అభినందనీయం.

అయినప్పటికీ ఆయా దేశాలలో ఇప్పటికీ పురుషుల అత్యధిక ఆధిపత్యం కొనసాగుతున్న దృశ్యాలనే చూస్తున్నాం. కారణాలు ఏవైతేనేం, ఆయా దేశాలలోని మహిళల సమస్యలు మహిళలకు తెలిసినంతగా పురుషులకు తెలిసే లేదా గుర్తిం చే అవకాశం తక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి ఓటర్లలో దాదాపు సగం మంది స్త్రీలు ఉంటున్నా, తమ కోసం తమను ఎన్నుకోవాలన్న స్పృహ వాళ్లలో పెరగాల్సి ఉంది.

- గడీల ఛత్రపతి