calender_icon.png 25 October, 2024 | 1:49 AM

సెలవు సరే.. కొలువులుంటాయా?

09-07-2024 03:30:00 AM

  • మహిళలకు నెలసరి సెలవులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఇది ప్రభుత్వ పరిధిలోని ఆంశమన్న చీఫ్ జస్టిస్

న్యూఢిల్లీ, జూలై 8: విద్యార్థినిలకు, ఉద్యోగాలు చేసే మహిళలకు నెలసరి సమయంలో కచ్చితంగా సెలవులు ఇచ్చేలా ప్రభుత్వం విధానాలు రూపొందించాలని దాఖలైన వ్యాజ్యం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ సమయంలో మహిళలకు సెలవులు ఇవ్వటం అవసరమే కానీ.. అది మహిళల ఉద్యోగాలు పోగొట్టేలా ఉండరాదని పేర్కొన్నది. న్యాయవాది త్రిపాఠి దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.

‘నెలసరి సమయంలో ఉద్యోగాలు చేసే మహిళ లకు సెలవులు అవసరమే. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం ఏమైనా తీసుకొంటే ఆ తర్వాత కంపెనీలు మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం నిరాకరిస్తే మొదటికే మోసం వస్తుంది కదా’ అని సీజైఐ వ్యాఖ్యానించారు. ఇది విధానపరమైన అంశమని, నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వ మేనని పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలే వారికి కొన్ని సార్లు చేటు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ‘నిజానికి ఇది ప్రభుత్వ పరిధిలోని విషయం. దీనిపై కోర్టు జోక్యం చేసుకోవడం తగదు’ అని తెలిపారు. దేశంలోని విద్యార్థినిలకు, ఉద్యోగినులకు నెలసరి సెలవులు తప్పనిసరిగా మంజూరు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీంను అభ్యర్థించారు. ఇదే విషయమై 2023 మేలో కేంద్రాన్ని కలిసినా ఎటువంటి స్పందన లేదని కోర్టుకు తెలిపారు. 

అక్కడికి వెళ్లండి

కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీని, అడిషనల్ సోలిసిటర్ జనరల్ వద్ద వాదనలు వినపించేందుకు పిటిషనర్‌ను అనుమతించింది. చైనా, జపాన్, వేల్స్, ఇండో నేషియా, యూకే, స్పెయిన్, జాంబియా, సౌత్‌కొరియా వంటి దేశాల్లో నెలసరి సెలవులు మంజూరు చేయబడుతున్నాయని కోర్టు దృష్టి కి తీసుకొచ్చారు. మన దేశంలో బీహార్, కేరళ రాష్ట్రాలు మాత్రమే మహిళలకు నెలసరి సెలవులు మంజూరు చేస్తున్నాయి.