calender_icon.png 27 October, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఆరంభానికి నోచుకొనేనా?

27-10-2024 12:21:59 AM

ప్రకృతి అందాల వీక్షణకు ఇంకా నిరీక్షణ తప్పదా?

రూ.6 కోట్ల నిధులు.. 561 ఎకరాలు నిష్ఫలమేనా?

  1. మిగిలిన పనులు పూర్తయ్యేదెన్నడు ? 
  2. పార్క్ తెరుచుకునేదెన్నడు..? పర్యాటకుల పెదవి విరుపు 

సిరిసిల్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణంతో పాటు చుట్టపక్కల గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి, వారు అడవి అందాలు వీక్షించి ఆహ్లాదాన్ని పొందాలనే ఉద్దేశంతో అటవీశాఖ సిరిసిల్ల- కామారెడ్డి ప్రధాన రహదారి  పక్కనే ఉన్న ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్-, హరిదాస్‌నగర్ అటవీ ప్రాంతంలో ప్రతిష్ఠాత్మకం గా అర్బన్ ఫారెస్ట్ పార్క్ నిర్మించింది.

మొత్తం 561 ఎకరాల్లో రూ.6 కోట్ల నిధులతో పార్క్‌లో పగోడాలు, ఆకర్షణీయమైన జంతువుల ప్రతిమలు, పిల్లలు ఆడుకునేందుకు జారుడు బండ, ఊయల వంటి సదుపాయాలు కల్పించింది. 2020 జూన్ 26న పార్క్ పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే పర్యాటకులకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, యంత్రా ంగం ఇప్పటికీ మీనమేషాలు లెక్కించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. పార్క్ పరిధిలో పనులన్నీ పూర్తయినప్పటికీ పార్క్‌కు తాళం వేసి ఉంచడంపై జిల్లావాసుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది.

సహజసిద్ధమైన చెరువు, ఔషధ మొక్కలు..

అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో సహజసిద్ధంగా ఉన్న ఊట చెరువు పార్క్‌కు ప్రధాన జల వనరు. దీని మధ్యలోకి వెళ్లే విధంగా నిర్మించిన పగోడా, అక్కడికి నడిచి వెళ్లేందుకు నిర్మించిన వంతెన ఈ పార్క్‌కే హైలైట్. పార్క్ పరిధిలో వందలాది రకాల మొక్కలు పెరుగుతున్నాయి.

వీటిలో అధిక సంఖ్యలో పెరుగుతున్నవి ఔషధ మొక్కలే కావడం విశేషం. యోగ సాధకులు యోగ సాధన చేసుకునేందుకు వీలుగా ఓ కేంద్రం పార్క్‌లో ఉంది. దీనికి సమీపంలోని ధ్యానం చేసుకునే బుద్ధుడి విగ్రహం పక్కనే పర్కులేషన్ ట్యాంక్ అందుబాటులోకి వచ్చింది.

పిల్లలు ఆడుకునేందుకు వీలుగా పార్క్‌లో జారుడు బల్లలు, ఉయ్యాలలు ఉన్నాయి. సైక్లింగ్‌కు వీలుగా ప్రత్యేకమైన ట్రాక్ ఉంది. కార్తీక వన భోజనాలు, సామూహిక భోజనాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. అడ్వెంచర్  పార్క్, ట్రీ హౌజ్, ఔట్ డోర్ జిమ్ కూడా అందుబాటులోకి వచ్చాయి.

అసంపూర్తిగా గెస్ట్‌హౌజ్ నిర్మాణం 

ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పా ర్క్ వచ్చి, అక్కడ బస చేసేందుకు వీలుగా పార్క్ చివరన రెండంతస్తుల గెస్ట్ హౌస్ నిర్మించాలని తలపెట్టింది. భవనం పనులు గోడల వరకే వచ్చి నిలిచిపోయాయి. భవనం పూర్తి స్థాయిలో నిర్మించకుండానే, కాంట్రాక్టర్లు పూర్తి బిల్లులు పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో భవనానికి ఇప్పటికే పగ్గుళ్లు ఏర్పడ్డాయి.

పక్షుల ఆకారంలోని ఆకృతులను పొదలు కమ్మేశాయి. ధ్యాన కేంద్రంలో మెట్ల వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు మెట్లకు ప్యాచ్‌లు వేసి మేనేజ్ చేస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచే కట్టడాలు, పగోడాలు, ఆకృతులు కళావిహీనంగా మారకముందే పార్క్‌ను ప్రారంభించి, అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు. 

పార్క్ ప్రత్యేకత ఇదీ...

హరిదాస్‌నగర్ అటవీ ప్రాంతంలో ఈ పార్క్ పర్యాటకులకు స్వాగత ద్వారం స్వాగతం పలుకుతుంది. అటవీశాఖ నేతృత్వంలో కళా కారులు పర్యాటకులను ఆకట్టుకునేలా స్వాగత ద్వారాన్ని తీర్చిది ద్దారు. పార్క్‌లో అక్కడక్కడా జీవకళ ఉట్టిపడేలా అనేక పులి, డైనోసార్, నెమలి, జింక సీతాకోక చిలుకలు, తుమ్మెదల గుంపు, ధ్యానం చేసుకుంటున్న బుద్ధుడి ఆకృతులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్నాయి.

అధికారులతో చర్చించి ప్రారంభిస్తాం..

అర్బన్ ఫారె స్ట్ పార్క్ ప్రారంభోత్సవ అంశం ప్రభుత్వ దృష్టి లో ఉంది. నేను చొరవ తీసుకుని త్వరలోనే అటవీశాఖ ఉన్నతా ధికారులతో చర్చిస్తా. పార్క్ పరిధిలో మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేయిస్తా. పార్క్‌ను జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్ది ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా.

 -ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్