మన దేశంలో సామాన్య ప్రయాణికులకు రైలు సౌకర్యం ఇంకా అందని ద్రాక్షగానే ఉందంటే ఆశ్చర్యమే. భారత రైల్వేలో కాలానుగుణంగా పెను మార్పులు గణనీయంగా జరుగుతున్నాయి. స్టేషన్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయమే. అదే సమయంలో అమృత్, వందే భారత్ రైళ్లను ఆకర్షణీయంగా తయారుచేసి, అధిక డబ్బులు వసూలు చేస్తూ పట్టాలపై పరుగులు తీయిస్తున్నారు.
కానీ, ప్రయాణికుల సంఖ్యకు తగినట్టు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం అంతే స్థాయిలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడం బాధాకరం. దేశవ్యాప్తంగాగల అనేక స్టేషన్లలో కనీస సౌకర్యాలైనా ఉండడం లేదు. వృద్ధులు, మహిళలు, పిల్లలు అనేక తంటాలు పడుతున్నారు.
మరుగుదొడ్లు డబ్బులకు మాత్రమే సేవలు అందిస్తూ కూడా దుర్గంధంతో నిండుకుంటున్నాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీలు టికెట్ విక్రయాలకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైల్వేల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా, సేవా కార్యంగా తీసుకోవాలి.
దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్