- తనపై నమోదైన కేసుల్లో రెండుసార్లు విచారణకు డుమ్మా
- వ్యూహం సినిమా ప్రమోషన్‌లో టీడీపీ, జనసేన నేతలను కించపరిచే విధంగా పోస్టులు
- ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు
- హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఒంగోలు పోలీసుల గాలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ) అరెస్ట్‌కు రంగం సిద్ధమైన ట్లు తెలుస్తోంది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి ఏపీలోని ఒంగో లు పోలీసులు చేరుకున్నారు.
కాగా.. సోమవారం ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. కాగా ఆయన వెళ్లకపోవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వర్మ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైమ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు నారా లోకేశ్ లను కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పలు పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈనెల 19న విచారణ కు హాజరుకావాల్సి ఉండగా.. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వర్మ అదేరోజు వాట్సాప్ ద్వారా ఒంగోలు పోలీసులకు సమాచారమిచ్చారు.
అనంతరం 25న ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు. గడువు ముగిసినా విచారణకు రాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి సోమవారం ఏపీ పోలీసులు వచ్చారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల గాలింపు..
ఆర్జీవీ హైదరాబాద్‌లో లేరని.. సినిమా షెడ్యూల్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇంటివద్ద ఉన్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో ఆర్జీవీ కోయంబత్తూరు, ముంబాయిలో ఉన్నారనే సమాచారం మేరకు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
అయితే ఆర్జీవీ సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్స్ లోకేషన్ హైదరాబాద్ పరిధిలో చూపిస్తుండటంతో శంషాబాద్, షాద్‌నగర్‌లో ని ఫాంహౌజ్‌లపై పోలీసులు దృష్టిసారించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్, షాద్‌నగర్ నియోజకవర్గంలో ఓ ప్రముఖ నటుడికి సం బంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఆర్జీవీ ఉన్న ట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీంతో ఏపీ పోలీసులు పలుచోట్ల గాలింపులు చేపట్టారు. ఆయనకు సంబంధించిన పలువురిని అదుపులోకి తీసుకొని రాంగోపాల్‌వర్మ గురించి ఆరా తీసినట్లు సమాచారం.
విచారణకు పూర్తిగా సహకరిస్తాం..
మరోవైపు ఆర్జీవీ తరపు లాయర్ బాలయ్య మీడియాతో మాట్లాడారు. విచారణకు సహకరిస్తామ ని.. కొంత సమయం కావాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. సినిమా పను ల్లో భాగంగా రాంగోపాల్ వర్మ వేరే ప్రాంతంలో ఉండటంతో వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లు చెప్పారు. అయితే ఆర్జీవీ ఇంటికి పోలీసులు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.