- నేరాలను ప్రోత్సహించేలా పుష్ప-2 సినిమా
- తొక్కిసలాట బాధ్యులపై చర్యలు తీసుకుంటే తప్పేంటి?
- మంత్రి సీతక్క
జనగామ/ములుగు, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే నేరస్తుడిని హీరోగా.. సమాజాన్ని, శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులను విలన్‌గా చిత్రీకరిస్తూ తీసిన సినిమాకు జాతీయ అవా ర్డు రావడమేంటని మంత్రి సీతక్క ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సోమవారం ములుగులో ఆమె మాట్లాడుతూ.. చట్టబద్ధంగా డ్యూటీ చేసే పోలీసులను పుష్ప-2 సినిమాలో వికృతంగా చూపించి, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే దొంగను మాత్రం హీరోగా చూపారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్.. పోలీసుల బట్టలు విప్పి కూర్చోబెట్టినట్టు చూపించడం ద్వారా సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని దర్శకుడిని ప్రశ్నించారు.
ఓ సాధా రణ మహిళ భర్తను అకారణంగా పోలీసులు చిత్రహింస లు పెడితే.. చంక న చంటిబిడ్డనెత్తుకొని ఆ మహిళ చేసిన పోరాటాన్ని చూపి న ‘జై భీం’లాంటి సందేశాత్మక చిత్రాలకు జాతీయ అవార్డు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఈ విషయంలో బీఆర్‌ఎస్ లేనిపోని రాద్ధాంతం చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం కాదా? అని ప్రశ్నించారు. ఆయనపై చట్టబద్ధంగా ముందుకెళ్తుంటే బీఆర్‌ఎస్ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు అల్లు అర్జున్‌పై వ్యక్తిగత కక్ష లేదని స్పష్టం చేశారు. అవార్డు విషయంలో కేంద్రం ఆలోచించాలని సూచించారు.