10-04-2025 12:56:11 AM
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): అక్రమమని తెలిసిన చర్యలేవి...? వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్ లోని శ్లోక కన్వెన్షన్ యాజమాన్యం గిఫ్ట్ డీడ్ స్థలం ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ స్థలం లో ఆక్రమణలు తొలగించాలని శ్లోక కన్వెన్షన్ యాజమాన్యం చెప్పకనే చెబుతున్నా, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు మాత్రం మొద్దు నిద్రలో తూగుతు న్నారు.
ఆదిభట్ల మున్సిపాలిటీలో జరిగే అక్రమాలు అధికారులకు కాసుల వర్షం కురిపి స్తున్నాయని, పేదవాడు చిన్న గూడు కట్టుకుంటేనే ఏదోఒక కొర్రీలు పెట్టే అధికారులు, కళ్ళ ముందే కోట్లు విలువ చేసే స్థలం కొల్లగొడుతుంటే కమిషనర్ మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ఫం క్షన్ హాల్ యాజమాన్యంతో కుమ్మక్కై ఇందులో పెద్ద మొత్తంలో ముడుపులు అం దటంతోనే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తప్పుడు పత్రాలతో ఋణం..
హెచ్‌ఎండిఏ ప్లాన్ లో భాగంగా పిండి శ్రీనివాస్ రెడ్డి, తన 24200 గజాల స్థలం లో నుంచి 1348.34 గజాలు రోడ్లు, పార్క్ ఏరియాల కోసం స్థానిక మున్సిపాలిటీ గిఫ్ట్ డీడ్ చేయగా, తనకు మిగిలింది 22851.66 గజాల స్థలం మాత్రమే. కానీ గిఫ్ట్ డీడ్ స్థలాన్ని ఆక్రమించి సీసీ రోడ్, ప్రహరీ గోడ నిర్మించిన శ్రీనివాస్ రెడ్డి, ఈ గిఫ్ట్ డీడ్ స్థలం, మిగిలిన స్థలాన్ని కలిపి అంటే 24200 గజాల స్థలాన్ని తన భార్య పిండి అర్చన పేరి ట సెప్టెంబర్ 2023 లో లీజ్ డీడ్ చేశాడు. అంతే కాకుండా తప్పుడు పత్రాలతో అక్టోబర్ 2023 లో డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ డాక్యుమెంట్ నం.14264/2023 తో కొత్తపేటలోని ఓ బ్యాంకులో ఋణం సైతం పొందాడు.
పేరుకే మున్సిపల్ నిబంధనలు..
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో సర్వం దోచుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ ఒక్క గిఫ్ట్ డీడ్ స్థలం ఆక్రమణ అంశమే కాదు, మున్సిపాలిటీ పరిధిలో జరిగే అక్రమ నిర్మాణాల వద్ద ఒక్కో బిల్డింగ్ కు రూ.3 నుంచి 5 లక్షల వరకు వసూల్ చేస్తున్నారని మున్సిపాలిటీలో కోడై కూస్తుం ది.
అక్రమాలను నిలువరించాల్సిన అధికారులే మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కుతూ అందినకాడికి దోచుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది అక్రమం అని తెలిసిన మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవడంలేదనీ, ఇప్పటికైన జి ల్లాస్థాయి అధికారులు స్పం దించాలని,దీనిపై పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.
వివరణకు దూరంగా..
గిఫ్ట్ డీడ్ విషయమై మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా ఈ విషయంలో తాను ఏమి మాట్లాడనంటూ దాటవేశారు. అదేవిధంగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి ఫోన్లో సంప్రదించగా తాను బిజీగా ఉన్నానంటూ కాల్ కట్ చేయడం కొసమెరుపు.