calender_icon.png 26 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్టాండా.. ప్రెవేట్‌దా?

26-02-2025 12:56:52 AM

  • పిట్లం బస్టాండ్‌లో ప్రైవేట్ వాహనాలే ఎక్కువ 
  • ప్రహరీ నిర్మించినా ఫలితం శూన్యం
  • ప్రైవేటు వాహనాలను నియంత్రించని ఆర్టీసీ అధికారులు

పిట్లం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థ తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద మండల కేంద్రాల్లో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేశారు. బస్సుల కోసం ప్రయాణికులు వేచి ఉండేందుకు ఏర్పాటుచేసిన ఆర్టీసీ బస్టాండ్లు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ వాహనాలు బస్టాండ్లో రాజ్యమేలుతున్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో 30 లక్షల రూపాయలు వ్యయముతో బస్టాండ్ లోకి ఇతర వాహనాలు రాకుండా ఉండేందుకు ప్రహరీ గోడ ను నిర్మించారు.

అంతవరకు బాగానే ఉన్నా బస్టాండ్ ప్రహరీ గోడకు కానీ, 10 నుంచి 15 వరకు చిన్న, పెద్ద ద్వారాలు ఏర్పాటు చేయడంతో, ప్రహరి గోడ నిర్మించి నిష్ప్రయోజనంగా మారుతుంది. ప్రైవేటు వాహనాలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రహరి గోడ నిర్మాణం చేపట్టిన ప్రైవేటు వాహనాలు బస్టాండ్ అవర్ణలోకి వచ్చే విధంగా 10 నుంచి 15 చోట్ల ప్రహరీ గోడకు ద్వారాలు ఏర్పాటు చేశారు. 

ఈ ద్వారాల ద్వారా స్థానికులు తమ రాకపోకలు కొనసాగించడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే, బస్టాండ్ లోపల ప్రైవేట్ వాహనాలు వచ్చి నిలుపుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ ప్రయాణికులు బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తుంది, బస్టాండ్ ఆవరణలోకి వచ్చిన ప్రయాణికులు దుర్వాసన తో అవస్థలు పడుతున్నారు. .  

  ప్రహరీలో అధికంగా ద్వారాలు

 30 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన గోడకు చిన్న చిన్న ద్వారాలు అనేకం ఏర్పా టు చేయడంతో నిరుపయోగంగా మారింది. ఇది సురక్షిత ప్రాంగణానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

స్థానికులు ఈ ద్వారాలను ఇళ్లకు సాధారణ మార్గాలుగా ఉపయోగిస్తున్నారు, తద్వారా బస్టాండ్ అంతరంగిక భద్రత కుంచించుకుపోయింది. ఇన్ని లక్షల ప్రజాధనం ఉపయోగించి ప్రహరీ గోడ కేవలం అలంకరణ కొరకు మాత్రమే నిర్మించారా, లేదా నిధులు ఉన్నాయి కదా ఎలాగోలా వాడుకుందామని నిర్మించారా అని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ప్రైవేట్ వాహనాల నిలయంగా మారిన బస్టాండ్..

పిట్లం ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం ప్రైవేట్ వాహనాల స్టాండ్ గా మారిపోయింది.ఆర్టీసీ వారు నడిపే బస్టాండ లేక ప్రైవేట్ వాహనాల కొరకు నడపబడే అడ్డానా అర్థము కాని పరిస్థితి నెలకొని ఉంది. బస్టాండ్ లోపలికి ప్యాసింజర్ ఆటోలు, కార్లు, క్రూయిసర్(తూఫాన్) బండ్లు, ద్విచక్ర వాహనాలు అనియంత్రితంగా ప్రవేశిస్తున్నాయి.

ఇది ప్రయాణికులకు ఇబ్బందులు, ప్రమాదాలను కలిగిస్తోంది.ఆర్టీసీ వారికి ధీటుగా మేమేం తక్కువ అని పోటీపడి మరి ఆర్టీసీ వారి యొక్క ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్నారు. ఆర్టీసీ అధికారులు చూసి కూడా చూడనట్లు ఉండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.ఏం చక్క యదేచ్చగా బస్సులు నిలబడే చోట నిలబెట్టి మరీ ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్లను కూర్చోబెట్టుకొని పోతుంటే ఆర్టీసీ అధికారులు  సంస్థ ఆదాయానికి గండి పడుతున్న దీన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నారు.

ముఖ్యంగా బాన్సువాడ డిపో మేనేజర్ ప్రహరీ గోడ నిర్మించేటప్పుడు వచ్చిన అడ్డంకులను సమయస్ఫూర్తితో, అందరినీ సమన్వయపరచుకుంటూ,నిర్మాణం కొరకు చూపించిన ఆసక్తి, ఉత్సాహం ఇప్పుడు  దాన్ని పర్యవేక్షించడంలో తమ యొక్క సిబ్బంది తమ విధులు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై ఆజమాయిషి చూయించకపోవడంతో సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

స్వచ్ఛతా కరువు..

మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, ప్రజలు బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నారు. ఫలితంగా, దుర్వాసన, అసౌకర్యం వ్యాపించాయి. దీన్ని ప్రజలు భరించలేక అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

ప్రజల అవస్థలు, పట్టించుకోని అధికారులు..

పిట్లం బస్టాండులో ప్రతి రోజు ప్రయాణికుల రద్దీ ఎక్కువవుతోంది. ఇప్పటికైనా ఇక్కడి పరిస్థితులు మారాలి సంబంధిత ఆర్టీసీ, మండల అధికారులు స్పందించి ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ లోకి  రాకుండా నిషేధించి,లక్షల రూపాయల ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుంది. 

మౌలిక వసతులను కల్పించాలి..

 బస్టాండ్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచి కనీస మౌలిక వసతులు బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులకు  కల్పించాలని,అలాగే ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు గమనించి తక్షణమే వాటిని పరిష్కరించాలని ప్రయాణికులు  కోరుతున్నారు.

ప్రైవేట్ వాహనాలను నియంత్రిస్తాం

పిట్లం బస్టాండ్ లోకి ప్రైవేటు వాహనాలు వస్తే అడ్డుకొని నియంత్రిస్తాం. ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే చర్యలకు పాల్పడితే చర్యలు తీసు కుంటాం. అధికారుల నిర్లక్ష్యం పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.

 సరితా దేవి, డిపో మేనేజర్ బాన్సువాడ, కామారెడ్డి జిల్లా