calender_icon.png 20 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిమాచల్ ప్రభుత్వం దివాళా?

01-09-2024 12:53:00 AM

  1. ఇప్పటికే రూ.75 వేల కోట్ల అప్పుతో సతమతం 
  2. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయిలు రూ.11 వేల కోట్లు 
  3. కొత్తగా పాత పెన్షన్ స్కీముతో మరింత ఊబిలోకి 
  4. మరో రూ.800 వేల రుణానికి ప్రయత్నాలు

సిమ్లా, ఆగస్టు 31: హిమాచల్‌ప్రదేశ్ భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే దాదాపు రూ.75 వేల కోట్ల రుణాలతో సతమతమవుతోంది. ఇదే రాష్ట్రానికి తలకు మించిన భారంగా ఉంటే వేతనాల పెంపుతో పాటు గత ప్రభుత్వంలో నుంచి చెల్లించాల్సిన జీతాల బకాయిలు, డీఏలు, పెన్షన్లు కలిపి మరో రూ.11 వేల కోట్లు ఉన్నాయి. ఈ కారణాలతో పర్యాటకం, తోటలు, జలవిద్యుత్తుపై ఆధారపడిన హిమాచల్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది.

వీటికి అదనంగా ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ కీలక ఓటు బ్యాంకు అయిన ఉద్యోగులకు హామీ ఇచ్చిన పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలుతో దివాళా తీసే పరిస్థితికి చేరుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ హామీ ప్రకారం 1.36 లక్షల ఉద్యోగులకు ఓపీఎస్‌ను కేటాయించాల్సి వస్తుంది. దీని వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.800 నుంచి రూ.900 కోట్ల వరకు అదనపు భారం పడుతుంది. దీనికి తోడు ఉచితాల ప్రభావం రాష్ట్రంలో ఆర్థిక గందరగోళానికి దారి తీసింది. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌తో పాటు అభివృద్ధి పథకాలకు చెల్లించేందుకు డబ్బు లేకుండా పోయింది. 

రూ.800 కోట్ల రుణానికి ప్రయత్నాలు

ఈ పరిస్థితుల్లో అదనంగా మరో రూ.800 కోట్ల రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, ఇది రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల కోసమేనని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హిమాచల్ తీసుకునే విదేశీ రుణాలపై రూ.3 వేల కోట్ల పరిమితిని కేంద్రం విధించింది. అలాగే కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రాష్ట్రాల రుణ సామర్థ్యాన్ని రూ.4 వేల కోట్లకు పరిమితం చేసింది. ఇప్పటికే ఈ పరిమితులన్నీ మించిపోగా అదనపు రుణం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇదిలా ఉండగా ఈ పరిస్థితులపై స్పందించిన హిమాచల్ సీఎం సుఖ్విందర్ సుఖు.. రాష్ట్రంలో ఆర్థిక పరిమితులను ఎదుర్కొనేందుకు అదనపు ఆదాయాన్ని సమకూ ర్చే చర్యలను ప్రారంభించి, అందుకు అవసరమైన వనరుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పవర్ ప్రాజెక్టులలో ఎక్కువ వాటాను కోరుతామని తెలిపారు. మద్యం విక్రయాలకు వేలం నిర్వహించడం ద్వారా ఖజానాకు అదనంగా 40 శాతం ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. 

జీతాలు, అలవెన్సులు వదిలి..

ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.11 వేల కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సీఎం సుఖు తప్పుబట్టారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల వల్ల అదనంగా రూ.5,000 కోట్ల అదనపు భారం పడిందని వివరించారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించడం వల్ల రుణాల సీలింగ్ నుంచి రూ.1,779 కోట్ల కోత విధించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్ రుణాల పరిమితి గతేడాదితో పోలిస్తే దాదాపు రూ.5,500 కోట్లు తగ్గినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కారణంగా రెండు నెలల పాటు మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు, క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ జీతా లు, అలవెన్సులు తీసుకోరని సుఖ్వీందర్ గురువారం అసెంబ్లీకి విన్నవించిన విషయం తెలిసిందే.