వయసు అరవై దాటిందా.. నడకలో మార్పులు సహజం. అరవై ఏళ్లు వచ్చేసరికి నడక వేగం తగ్గుతుంది. అయితే అదేపనిగా ముందుకు పడిపోవటం, తూలటం వంటివి గమనిస్తే జాగ్రత్త పడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అరవైలో కూడా హాయ్‌గా నడిచేస్తుంటారు. కానీ నిజానికిదో అత్యంత సంక్లిష్ట ప్రక్రియ. నడక వేగం మన ఆరోగ్యాన్నీ పట్టి తెలుస్తుంది. అయితే అదేపనిగా ముందుకు పడిపోవడం, తూలటం వంటివి గమనిస్తే జాగ్రత్త పడటం మంచిది. డాక్టర్‌ను సంప్రదించి కారణమేంటో తెలుసుకొని.. చికిత్స తీసుకోవాలి.
వయసు మీద పడుతున్నకొద్దీ కండర మోతాదు, బలం, నాణ్యత తగ్గుతూ వస్తుంటాయి. దీన్నే సార్కోపీనియా అంటారు. ఇది నలభైలో మొదలవుతుంది. మరోవైపు నాడీ వ్యవస్థ కూడా క్షీణిస్తూ వస్తుంటుంది. శరీరం మొత్తమంతా విస్తరించి ఉన్న నాడుల సామర్థ్యం, నాడీ కణాల సంఖ్య తగ్గుతుంటాయి. 20 ఏళ్ల మధ్యలో ఏటా 0.1 శాతం చొప్పున నాణీకణాలు తగ్గుతాయని అంచనా. అరవై ఏళ్లు దాటాక వీటి క్షీణత వేగం మరింత పెరుగుతుంది. ఎవరైనా 90 ఏళ్ల వరకూ బతికారనుకోండి. వీరిలో 50 ఏళ్ల వయసు నాటితో పోలిస్తే 90 ఏళ్ల వయసులో మెదడు కణజాలం బరువు 150 గ్రాముల తక్కువగా ఉంటుంది.
నాడీ వ్యవస్థపై..
నడక వేగం తగ్గటం, సాఫీగా నడవకపోవటం పా ర్కిన్సన్స్ వంటి నాడీ క్షీణత సమస్యలకు తొలిదశ సం కేతమని చెప్పుకోవచ్చు. పార్కిన్సన్స్‌లో మెదడు నుం చి ఎముకలకు అంటుకొనే కండరాలకు సంకేతాలు అందటం ఎక్కువవుతుంది. పార్కిన్సన్స్ తొలిదశలో ఇలాంటి లక్షణాలు సూక్ష్మంగా కనిపిస్తుంటాయి. నాడులు క్షీణించటం వల్ల అడుగు వేయటానికి ఎక్కువ సమయం పడుతుంది.
పాదం వంగిపోవటం..
కాలు ముందు భాగాన మోకాలు నుంచి మడమ వరకూ ఉండే కండరాలు పాదాన్ని పైకి లాగి ఉంచుతాయి. దీని మూలంగానే మనం ముందుకు అడుగు లు వేస్తున్నప్పుడు పాదం పైకి లేస్తుంది. కానీ కొందరిలో పాదం ముందుకు వంగిపోతుంటుంది. (పుట్ డ్రాప్). దీంతో వేళ్లు నేలకు తాకి, కింద పడుతుంటా యి. మధుమేహం మూలంగా నాడులు దెబ్బతిన్నవారిలో దీన్ని చూస్తుంటాం. ఎక్కువసేపు కొన్ని రకాల యోగాసనాలు వేయటం కారణం కావొచ్చు.
విటమిన్ల లోపంతో..
విటమిన్ బి12 లోపంతోనూ నడుస్తున్నప్పుడు తడబడొచ్చు. పెద్దవారిలో బి12 లోపం లక్షణాలు బయట పడటానికి నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ నాడీ వ్యవస్థ పరిపక్వమవుతున్న పిల్లల్లో తక్కువ కాలంలోనే కనిపించొచ్చు. ఎందుకంటే నాడీ వ్యవస్థను కాపాడటంలో విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. మంచి విషయం ఏంటంటే.. దీని లోపాన్ని సరిచేసుకోవటం తేలికే. మాత్రలు, అవసరమైతే ఇంజెక్షన్లతో భర్తీ చేసుకోవచ్చు. మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, మజ్జిగ వంటి బి12తో కూడిన ఆహారం ఎంతో ఉపయోగపడుతుంది.
చెవి ఇన్‌ఫెక్షన్లతో..
లేబీరైనైటిస్ వంటి లోపలి చెవి సమ్యలూ తాత్కాలికంగా నడక తీరును మార్చుస్తాయి. తూలిపోయేలా చేయొచ్చు. ఇవి చాలావరకూ వాటంతటవే తగ్గుతాయి. చెవిలోని ద్రవం నుంచి అందే సంకేతాలతోనే మెదడు మనం నిల్చున్నామా, కూర్చున్నామా అనే విషయాన్ని నిర్ణయించుకుంటుంది. లోపలి చెవి ఇన్‌ఫెక్షన్‌కు గురైతే చెవిలోని ద్రవం కదలికలు అస్తవ్యస్తమవుతాయి. అప్పుడు చెవి నుంచి అందే సంకేతాలను పోల్చుకోవటంతో మెదడు తికమకపడుతుంది. కళ్లకు కనిపించే దృశ్యానికి, చెవి నుంచి అందే సంకేతాలకు పొంతన కుదరకపోవటం వల్ల తూలిపోయే ప్రమాదముంది.