calender_icon.png 7 February, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారమంతా వేతనజీవులపైనేనా?

30-01-2025 12:00:00 AM

బడ్జెట్ రోజు సమీపిస్తున్న కొద్దీ మధ్యతరగతి, ముఖ్యంగా ‘జీతాలు పొందే వర్గంపై మళ్లీ ఏ రకమైన ప న్నుల భారం పడనుందో’ అనే చర్చ ఊపందుకున్నది. దేశంలోని పన్నుల భారమంతా చాలావరకు తక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల భుజాలపైనే ప డుతున్నదన్నది వాస్తవం.

అందుకే, రానున్న బడ్జెట్‌లో తమకు ‘ఏమైనా ఉపశమనాలు లభిస్తాయా?’ అని ఆశగా వారంతా ఎదురుచూస్తున్నారు. వ్యక్తులు దాఖలు చేసిన పన్ను రిటర్న్స్ సంఖ్య 2013-14లో 3.35 కోట్లనుంచి 2023-24లో 7.54 కోట్లకు పెరిగింది. చాలామంది కేవలం వ్యక్తిగత ప్ర యోజనాల కోసం జీరో-టాక్స్ రిట ర్న్స్‌ను దాఖలు చేస్తారు.

జీరో- ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేసే వ్యక్తుల సంఖ్యకూడా ఇప్పుడు రెట్టింపు అయ్యింది. అవి అదే పైన చెప్పిన కాలంలో 1.69 కోట్లనుంచి 4.73 కోట్లకు పెరిగింది. మరోవైపు, వాస్తవానికి ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తుల సంఖ్య 2013--14లో 1.66 కోట్లు ఉండగా, 2023-24లో 2.81 కోట్లకు పెరిగింది. 

వారికి ఉచితాలు, వీరికి తాయిలాలు

2019 సెప్టెంబర్‌లో ప్రస్తుత కంపెనీలకు ‘బేస్ కార్పొరేట్’ పన్ను రేటును 22% (30% నుంచి)కు, 2019 అక్టోబర్ 1న తర్వాత విలీనమైన కొత్త తయారీ సంస్థలకు 15% (25% నుంచి) కు తగ్గిస్తున్నట్లు ప్రభు త్వం ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ: కార్పొరేట్ ఇన్‌కమ్ టాక్స్) వసూళ్లు వ్యక్తిగత ఆదా యపు పన్ను (పీఐటీ: పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్) వసూళ్లతో పోలిస్తే తగ్గడం ఆశ్చర్యకరం.

కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు 2019----20లో రూ. 5.56 లక్షల కోట్లు ఉండగా, 2024-25లో రూ. 10.2 లక్షల కోట్లకు పెరిగాయి. ఇది 83% పెరుగుదల. అదే కాలంలో, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుంచి రూ. 11.87 లక్షల కోట్లు అయింది. ఇది 141% పెరుగుదల. అంటే, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లే ఎక్కువన్న మాట.

ఇక, జీఎస్‌టీ విషయానికి వస్తే, భారతదేశంలో వార్షిక వ సూళ్లు సుమారు రూ. 18 లక్షల కోట్లనుంచి రూ. 20 లక్షల కోట్లవరకు ఉంటున్నాయి. ఆసక్తికరమైన విషయమేమింటే, ఈ మొత్తం లో వ్యక్తులు, కార్పొరేషన్ల వాటాలను విడివిడిగా విభజించి చూపించే సమాచారాన్ని ప్రభుత్వం అందించడం లేదు.

కానీ, వ్యాపా ర ప్రయోజనాల కోసం కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవలకు కార్పొరేషన్లు ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ల’ను క్లెయిమ్ చేస్తాయి. దీన్నిబట్టి, జీఎస్‌టీ వసూళ్లలో ఎక్కువ భాగం ఆయా వ్యక్తుల లెక్కల్లోకే వెళ్తాయి.

మొత్తం జీఎస్‌టీ వసూళ్లలో ఐదు రాష్ట్రాలు సగానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. మహారాష్ట్ర 21.2%తో అత్యధిక వాటాను కలిగి ఉండగా, తర్వాత కర్ణాటక 9.3%తో, గుజరాత్ 8.4%తో, తమిళనాడు 8.2%తో ఉన్నాయి. 2023లో 6.8%తో ఉత్తరప్రదేశ్ ఐదవ స్థానంలో ఉండింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ మినహా పైన పేర్కొన్న అన్ని రాష్ట్రాలు జాతీయ సగటు 31.1% కంటే ఎక్కువగా పట్టణీకరణ స్థాయిలను కలిగి ఉన్నాయి. దీనర్థం భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పట్టణ ప్రాంతాల్లో జీఎస్‌టీ వసూళ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వేతన జీవులైతేనేమి, వ్యాపార ఉపాధిని పొందుతున్న వారైతేనేమి మొత్తానికి మధ్యతరగతి వ్యక్తులే ఈ దేశంలో అధిక పన్నుల భారాన్ని మోస్తున్నట్టు ఈ లెక్కలనుబట్టి అర్థమవుతున్నది.

ప్రభుత్వాలకు పాడిఆవు

మన దేశంలో పన్నులు ఎగ్గొట్టే వారు ఎగ్గొడుతూనే ఉంటారు. రకరకాల మార్గాలలో నల్లధనం కూడుతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దాని నియంత్రణకు తీసుకునే చర్యలు మృగ్యం. ఇదే సమయంలో కార్పొరేట్ కంపెనీలకు రకరకాల ప్రయోజనాలు, తాయిలాలు ఇవ్వడంలో ప్రభుత్వం ముందుంటుంది. పెద్ద ఎత్తున వందలు, వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టే వారి గురించి కూడా ప్రభుత్వం మాట్లాడదు.

మరోపక్క ఇదే పన్ను సొమ్మును ఉచిత పథకాల పేరుతో ప్రజలకు ముట్ట జెప్పడానికి ఏ మాత్రం వెనుకాడదు. కానీ, మధ్యతరగతి వేతన జీవులకు ఏవో కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి కూడా వారికి చేతులు రావు. కారణం, వచ్చే ఆ పన్నులు కూడా తగ్గిపోతాయన్న దురాశ.

ఒక వ్యక్తి సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించి 30% ఆదా చేస్తే, సగటున వినియోగ వ్యయంపై 23% జీఎస్‌టీ రేటుతో, పన్ను భారం ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రూ. 40 లక్షలు లేదా ఆదాయంలో 40% ఉంటుంది. అదే వ్యక్తి 15% ఆదా చేస్తే, పన్ను సంభవం 43%కి పెరుగుతుంది. పొదుపులు లేకపోతే, భారం 47%కి పెరుగుతుందన్న మాట.

విపరీతమైన ధరలు, ఖర్చుల నేపథ్యంలో అధిక మొత్తం పొదుపు రాన్రాను కష్టమవుతుంది. భారతదేశంలోని మధ్య తరగతి వర్గాన్ని చాలా కాలంగా వరుస ప్రభుత్వాలు నగదు ‘పాడి ఆవు’గా పరిగణిస్తున్నాయన్నది వాస్తవం.

పన్ను మినహా యింపులు, వాహనాలు, గృహాల కొనుగోళ్లకు ప్రోత్సాహకాలు, తగ్గింపుల పరంగా కార్పొరేట్ కంపెనీలతో సమాన ప్రయోజనాలు వారికి ఎందుకు ఇవ్వరు? ఎగ్గొట్టకుం డా కచ్చితంగా పన్నులు కట్టే ఆధునిక యువతరం ఈ దుస్థితి (దుర్నీతి)ని నిలబెట్టి ప్రశ్నిస్తుంటే రాజకీయంగా, ప్రభుత్వాల పరంగా జవాబు చెప్పేవాళ్లే లేరు.

అటు పేదవారు, ఇటు సంపన్న వర్గం ఇరువురూ ఏదో రకంగా ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు. ఎటూ కాకుండా అన్యాయానికి గురవుతున్నది మధ్యతరగతి వారే. తమ న్యాయమైన పరిష్కారాల కోసం వారినుం చి డిమాండ్ పెరుగుతోంది.

గృహ సంబం ధ పొదుపులు అత్యల్ప స్థాయిలో ఉన్నప్పుడు, కార్పొరేషన్ల వేతనాల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని కవర్ చేయడానికి సరిపోని సమయంలో, మధ్యతరగతిలో అసంతృప్తి అంతకంతకూ పెరగకుండా ఈసారి బడ్జెట్‌లో అయినా ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందా! 

 గడీల ఛత్రపతి