- డబ్బులు తీసుకుని ఫైళ్లు క్లియర్ చేయిస్తున్న వైనం!
- లేదంటే ఎక్కడి ఫైలు అక్కడే..
నారాయణపేట, డిసెంబర్ 25 (విజయక్రాంతి): నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో ఓ క్లర్కు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. ధరణిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల నుంచి కలెక్టరేట్‌కు ఫైళ్లను పంపితే.. కలెక్టరేట్‌లో నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నట్టు తెలుస్తున్నది. సదరు శాఖ జిల్లా అధికారి కింద పనిచేసే ఓ క్యాంపు క్లర్కు డబ్బులు తీసుకుని ఫైళ్లను అధికారి వద్దకు పంపుతున్నట్టు ఆరోపణలున్నాయి.
క్లర్లు చేతి తడవందే పైఅధికారి వద్దకు ఫైలు వెళ్లడం లేదని సమాచారం. నారాయణపేట మండలంలోని సింగారం గ్రామానికి చెందిన కుర్వ జానమ్మ పేరున ఉన్న 1.14 ఎకరాల భూమిని గతంలో కొంత మంది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్ట్ బీ ద్వారా నమోదు కాగా.. కుర్వ జానకమ్మకు బదులుగా ఆమె కూతురు నాగమ్మ ఫొటో, ఆధార్‌కార్డు రికార్డుల్లో నమోదయ్యాయి.
నాగమ్మ ఫొటో, ఆధార్ కార్డు నెంబర్ల తొలగింపునకు గత సెప్టెంబర్ నెలలో ఆన్‌లైన్‌లో దరఖాస్థు చేసుకున్నది. తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు ఆ దరఖాస్తు చేరింది. కానీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. సదరు క్లర్కుకు డబ్బులు ఇవ్వనందునే ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా క్యాంపు క్లర్కుపై కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.