calender_icon.png 26 March, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్క కొడంగల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ పథకమా? X మీ పని తీరును కేసీఆర్ మనవడే బయటపెట్టాడు!

26-03-2025 01:16:35 AM

ఒక్క కొడంగల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ పథకమా?

  1. రేవంత్‌రెడ్డి రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి
  2. అన్ని సర్కార్ బడుల్లోనూ పథకం అమలు చేయాల్సిందే
  3. మాజీ మంత్రి సబిత

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ (అల్పాహారం) పథకం అమలు చేయాలని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో పాఠశాల, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వాణిజ్య పన్నులు, యువజన, క్రీడలు, రోడ్డు భవనాలు, అబ్కారీ, పర్యాటక, సాం స్కృతిక, అడవులు, పర్యావరణశాఖకు సం బంధించిన బిల్లులను ప్రవేశపెట్టగా, వాటిపై బీఆర్‌ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి అనే ప్రశ్నలు లేవనెత్తారు.

సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం మొత్తానికి సీఎం అని, కేవలం ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో 6 వేల సర్కార్ బడులు మూతపడ్డాయని నాడు గొంతెత్తిన రేవంత్‌రెడ్డి.. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక, ఎన్ని బడులను పునరుద్ధరించారో సమాధానం ఇవ్వాలని నిలదీశారు.

నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట చెప్పడం రేవంత్‌రెడ్డికే చెల్లిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కస్తూర్బా విద్యాలయాలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేయాలన్నారు. మాడల్ పాఠశాలల్లో వెంటనే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నాడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ.. తాను సీఎం అయ్యాక కేవలం 11 వేల టీచర్ పోస్టులు మాత్రమే భర్తీ చేశారని ధ్వజమెత్తారు.

మీ పని తీరును కేసీఆర్ మనవడే బయటపెట్టాడు!

  1. ముక్కుమూసుకుని గౌలిదొడ్డి బడిని సందర్శించాడు..
  2. ఎన్నికల లబ్ధి కోసమే గత ప్రభుత్వం అల్పాహార పథకాన్ని తెచ్చింది.. 
  3. మాజీ మంత్రి సబితకు మంత్రి సీతక్క కౌంటర్

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాడు సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టిందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి సీతక్క ఆరోపించారు. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి లేవనె త్తిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. బీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరు ఏమిటో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మనవడు హిమాన్షునే ఓ సందర్భంలో మీడియాకు చెప్పాడని ఎద్దేవా చేశారు.

ముక్కుమూసుకుని మరీ గౌలిదొడ్డి సర్కార్ బడిని సందర్శించాడని, అలాంటి పాఠశాలలను తన జీవితంలో చూడలేదని ఆవేదన వ్యక్తం చేశాడని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నంత కాలం బీఆర్‌ఎస్ ఏనాడూ బ్రేక్‌ఫాస్ట్ పథకం గురించి పట్టించుకోలేదని, అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం పథకంపై మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.

పట్టుమని పిడికెడు పాఠశాలల్లోనైనా పథకం సక్రమంగా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. పథకానికి సంబంధించిన రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటే, తమ ప్రభుత్వం వచ్చాకే వాటిని చెల్లించామని స్పష్టం చేశారు.

పాఠశాలల సంఖ్యను పెంచామని బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకున్నదని, కానీ.. ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సంగతిని మాత్రం పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ పేరుతో పేదపిల్లల భవిష్యత్తును బీఆర్‌ఎస్ అంధకారంలో నెట్టిందని ధ్వజమెత్తారు.