వందల ఏండ్ల హైదరాబాద్‌పై విషం చిమ్ముతున్న నిన్నమొన్నటి నాయకులు
దేశానికి స్వాతంత్య్రం రాకముందే సకల వసతుల కోవెల భాగ్యనగరం
స్వార్థ రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్‌పై గగ్గోలు
* నది చేపలతో నిండినట్టుగా.. ఓ ప్రభూ, ఈ నగరం ప్రజలతో నిండిపోవాలి.
* 1591లో హైదరాబాద్ నగర నిర్మాణానికి పునాదిరాయి వేసిన సమయంలో కులీకుతుబ్‌షా అన్న మాటలివి. ఏ సుముహూర్తాన పునాదిరాయి పడిందో గానీ దేశంలోనే అతిపెద్ద నగరంగా విస్తరించి హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాపితమైంది.
బూడిద సుధాకర్ :
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : హైదరాబాద్ ఒక చారిత్రక నగరం. సుమారు 433 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ బ్రాండ్‌పై నిన్న మొన్నటి రాజకీయ నాయకులు కూడా గగ్గోలు పెడుతు న్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా హైదరాబాద్ నగర ఖ్యాతి దెబ్బతింటోందని వలస పాలకులు ఎలా గగ్గోలు పెట్టారో, ఇప్పుడు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గుతున్నదని దుష్ర్పచారం చేస్తున్నారు. అంతేకాదు హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను తగ్గించేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదని బీఆర్‌ఎస్ నాయకులు బాహాటంగా ప్రకటన చేసేవరకు వెళ్లారు.
నిజానికి ఎవ్వరో ఒక్కరు తగ్గిస్తే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ తగ్గుతుందా..? ఎవరో ఒకరు పెంచితే హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందా..? ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజమైపోతుందని నమ్ముకున్న రాజకీయ నాయకులు తమతమ రాజకీయ స్వలాభం కోసం తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌పై విషం చిమ్ముతున్నారు. ఎవరిది పై చేయి అనే విధంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో చారిత్రక హైదరాబాద్‌కు మకిలి అంటిస్తున్నారు.
దేశానికి స్వతంత్రం రాకముందే
నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇప్పటిది కాదు. భారతదేశంలో నిజాం విలీనానికి ముందే హైదరాబాద్ బ్రాండ్ ఓ వెలుగు వెలిగింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన రాజ్యంగా భాసిల్లింది. చరిత్ర లోతుల్లోకి వెళితే హైదరాబాద్‌కు పునాదిరాయి పడినప్పటి నుంచి అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్‌కు కేరాఫ్ హైదరాబాద్. దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికే హైదరాబాద్ రాష్ర్టంలో అసెంబ్లీ భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంట్, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డైనేజీ వ్యవస్థ, నిరంతరం మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజీల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నాయి.
ఈ విషయం ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు.. ‘హైదరాబాద్‌లో పార్లమెంట్ భవనం మినహా, ఒక దేశానికి ఏమేమీ కావాలో అవన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి’అని సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ ఆనాడే ప్రకటించారు. ఆయన సూచన మేరకే బొల్లారంలో రాష్ర్టపతి నిలయాన్ని ఏర్పాటుచేశారు. 1956లోనే హైదరాబాద్ దేశంలోనే ఐదవ పెద్ద నగరంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ అంటేనే ముత్యాలకు పెట్టింది పేరు. ఇక చెరువుల సంగతి చెప్పనక్కరే లేదు. సిటీ ఆఫ్ లేక్స్‌గా వినుతికెక్కింది. హైదరాబాద్ నగరాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇరాన్ లోని ‘ఇస్ఫహాన్’ నగరంలా తీర్చిదిద్దాడు.
ఈ నేల స్వభావంతోనే..
డెక్కన్ పీఠభూమిలో హైదరాబాద్ భూ భాగం విస్తరించి ఉంటుంది. ఇక్కడ ప్రకృతి విపత్తులు వచ్చేందుకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. దీంతో భారత ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను హైదరాబాద్ నగరంలో నెలకొల్పింది. ముఖ్యంగా భారత రక్షణ శాఖకు సంబంధించి అత్యంత కీలకమైన డీఆర్‌డీఎల్, బీడీఎల్, ఏఓసీ (ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్)ను, ఈసీఐ ఎల్, ఎన్‌ఎఫ్‌సీ, ఎఫ్‌సీఐ వంటి సంస్థలను ఏర్పాటు చేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వాళ్లు కూడా యుద్ధ సామాగ్రిని భద్రపర్చడంతో పాటు రవాణా చేసుకునేందుకు హకీంపేట్‌లో ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేసుకున్నారు.
అలాగే సికిం ద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోనే దేశ రక్షణా సంస్థలో పని చేసే ఉన్నతస్థాయి అధికారులు నివాసం ఉంటారు. రిటైర్ అయిన తర్వాత వారు అనేక మంది హైదరాబాద్‌ని తమ శాశ్వత చిరునామా చేసుకున్నారు. తెలంగాణలో సమతుల వాతావర ణం, విశాలమైన రోడ్డు, రైల్ (సౌత్‌సెంట్రల్ రైల్వే) మార్గాలతో పాటు ఏయిర్‌పోర్టు అందుబాటులో ఉన్న ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల జీవనానికి అనుకూలంగా ఉండటం తో పాలకులు అడిగితే చాలు క్షణం ఆలస్యం చేయకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరుగెత్తుకొస్తున్నాయి. హైదరాబాద్‌ను చూసి పెట్టుబడులు వస్తున్నాయి తప్ప.. ఇక్కడి పాలకులను చూసి కాదు అనేది జగమెరిగిన సత్యం.
పరాయి పాలకుల ఎంట్రీతో..
సీమాంధ్రలో తెలంగాణ విలీనమైన తర్వాత హైదరాబాద్‌లో యథేచ్ఛగా దోపిడీ రాజ్యమేలింది. హైదరాబాద్‌లో సినిమా థియేటర్లు, హైటెక్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ, కార్పొరేట్ ఆస్పత్రులు, ఫ్లుఓవర్లు, ఐటీ రంగం, టూరిజం పేరు చెప్పి మేమే అభివృద్ధి చేశామని నేడు నగరేతరులు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు వేరు. జనాభా లెక్కల ప్రకారం చూస్తే హైదరాబాద్ జనాభా కోటిన్నర వరకు ఉంటుంది. దేశంలోని ఏపీ ప్రాంత ప్రజలతో పాటు దేశంలోని మిగిలిన 28 రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రజలందరిని తనలో దాచుకుంది హైదరాబాద్. కానీ నేటికి కొందరు నాయకులు తమ వల్లనే హైదరాబాద్ కీర్తి పెరిగిందంటూ నేటికి డాంబికంగా మాట్లాడుతున్నారు. వారి బాటలోనే ప్రస్తుత రాజకీయ నాయకులు ఆయన వల్లనే హైదరాబాద్‌కు ఖ్యాతి పెరిగింది అంటే.. లేదు లేదు ఈయన వల్లనే హైదరాబాద్‌కు ఖ్యాతి పెరిగింది అంటూ ప్రగల్భాలకు పోతున్నారు. కానీ ప్రపంచంలోనే సుసంపన్నమైన, దీ బెస్ట్ లీవబుల్ సిటీగా కీర్తి గడిస్తున్న హైదరాబాద్‌ను అవకాశవాద రాజకీయాల కోసం తమ గుప్పిటపట్టుకున్నారు.
హైదరాబాద్ సంస్కృతిని నాశనం చేసి, తమ స్వార్థ రాజకీయాల కోసం గంగా జమునా తెహాజీబ్ లాంటి హైదరాబాద్ నగరంలో హిందూ, ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ప్రాంతీయ విద్వేశాలను రెచ్చగొట్టి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను దిగజార్చే కుట్రలు చేశారు తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూను సరిగా అర్థం చేసుకున్న దాఖలాలు లేవు.