calender_icon.png 10 November, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాలకు వెళ్ల్లేవారికి ఆ సర్టిఫికెట్ తప్పదా?

29-07-2024 01:12:27 AM

  1. బడ్జెట్ ప్రతిపాదనల్లో ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (టీసీసీ)పై సోషల్ మీడియాలో వదంతులు
  2. విదేశాలు వెళ్లే వారందరీకీ టీసీసీ తప్పనిసరి చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
  3. వివరణ ఇచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్

న్యూ ఢిల్లీ, జూలై 28: ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపన్ను విభాగానికి సంబంధించి చేసిన కొన్ని ప్రతిపాదనలు కొత్త వివాదానికి దారితీశాయి. విదేశాలకు వెళ్లేవారందరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (టీసీసీ) తీసుకోవాలంటూ బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం దీనిపై వివరణ ఇచ్చింది. బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు విదేశాలకు వెళ్లే అందరికీ వర్తించవని.. కేవలం ఆర్థిక అవకతవకలకు పాల్పడిన, పెద్ద మొత్తంలో ట్యాక్స్ బకాయిలు ఉన్నవారికి మాత్రమే అవి వర్తిస్తాయని క్లారిటీ ఇచ్చింది.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 230 ప్రకారం ప్రతీ వ్యక్తి పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందవలసిన అవసరం లేదు. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన, సంపన్న పన్ను చట్టం కింద కేసులు నమోదైన వారు మాత్రమే టీసీసీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. టీసీసీ పొందడానికి బ్లాక్ మనీ యాక్ట్ వర్తించే నిబంధనలు కూడా చేర్చాలని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పుడిదే వివాదానికి దారితీసింది. అయితే ఆ ప్రతిపాదన సవరణ ప్రకారం నివాసితులందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందవలసిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.