- ఎన్‌హెచ్ 163 జాతీయ రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం
- 200 పైగా మరణాలు
- పార్లమెంట్‌లో జాతీయ రహదారి ఊసేత్తని ఎంపీ
వికారాబాద్, జనవరి- 16 : బీజాపూర్- హైదరాబాద్ ఎన్‌హెచ్ 163 జాతీయ రహదారి నిత్యం రక్త మోడుతుంది. ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పరిగి నియోజక వర్గంలోని పూడూర్, పరిగి కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాజపేట్ దౌల్తాబాద్ కొడంగల్ మీదుగా పోతుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ గుల్బర్గా వంటి పట్టణాలకు పోవాలంటే ఈ జాతీయ రహదారి గున్ననే పోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ తాండూరు వంటి పట్టణాలకు పోవాలన్న ఈ దారి వెంబడే పోవాలి.
జిల్లాలోని తాండూరులో నాపరాతి గనులు సిమెంట్ కర్మాగారాలు ఉండడంతో పాటు వికారాబాద్‌లో అనంతగిరి పర్యాటక కేంద్రం ఉండటంతో ఈ రహదారి ఎప్పుడు వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. మన్నెగూడ నుండి జాతీయ రహదారి పనులు పూర్తికాగా అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డు ఇరుకుగా మారింది. దీంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారి నిర్మాణంలో తీవ్ర జాప్యం..
అప్ప జంక్షన్ నుండి బీజాపూర్ వరకు 2016లో జాతీయ రహదారిగా మారింది కానీ అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ వరకు సుమారు 45 కిలోమీటర్ల మేర పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఇందుకు అవసరమైన 266. 55 హెక్టార్ల భూసేకరణ కూడా పూర్తయింది. ప్రారంభంలో కోర్టు కేసులు ఉండటంతో రోడ్డు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది.
ప్రస్తుతం అన్ని రకాల కోర్టు కేసులు తొలగి పోయిన జాతీయ రహదారి నిర్మాణం ముందుకు సాగడం లేదు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమవు తాయని ఆయా పార్టీల నాయకులు చెప్తూ వస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఏలు గడుస్తున్న రోడ్డు నిర్మాణపు పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
46 కి.మీ పొడవు, రూ. 928.14 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతుంది. రోడ్డు విస్తరణకు అవసరమైన భూసేకరణ, చెట్ల తొలగింపు వంటి కోర్టు కేసులు తొలగిపోయిన పనులు ముందుకు సాగడం లేదు.
రహదారి ఊసెత్తని ఎంపీ..
2022 ఏప్రిల్ 29న జాతీయ రహదారి నిర్మాణం పనులకు కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్గరి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు పాటు పనుల్లో పురోగతి కనిపించింది. గత మూడు ఏళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఈ జాతీయ రహదారి నిర్మాణం విషయంలో ప్రజలు ఆశించిన మేర శ్రద్ధ చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గత రెండు నెలల క్రితం ఆలూరు గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సందర్భంగా స్పందించిన ఎంపీ జాతీయ రహదారి పనులు ప్రారంభమై నట్లు ప్రకటించారు.
ఎంపీ ప్రకటనతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ ప్రకటన తర్వాత ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇంతకీ ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తవుతుందా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇద్దరు ప్రముఖుల నియోజకవర్గాలకు ఇదే దారి..
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్ కు వెళ్లాలంటే ఈ ఇద్దరు ప్రముఖులు అప్ప జంక్షన్ నుండి మన్నెగూడ మీదుగానే పోవాల్సి ఉంటుంది. జిల్లాకు చెందిన ఇద్దరు పెద్ద నాయకులు ఉన్న రహదారి విస్తరణ పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుం దోనని చర్చ జరుగుతుంది.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్ హెచ్ 163 విస్తరణ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారులు ప్రత్యేక శ్రద్ధ చూపి జాతీయ రహదారి పనులు పూర్తయ్యేలా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.