calender_icon.png 26 April, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లొంగుబాటే శరణ్యమా?

26-04-2025 12:35:40 AM

  1. మావోయిస్టులకు ఆహారం, తాగునీటి కొరత 
  2. కర్రెగుట్టలో సైనిక శిబిరం ఎఫెక్ట్
  3. చర్చలకు సిద్ధం.. కాల్పులు విరమించండి: మావోయిస్టుల లేఖ

చర్ల, ఏప్రిల్ 2: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని కర్రె గుట్ట వద్ద నాలుగు రోజులుగా మావో యిస్టులపై అతిపెద్ద సైనిక ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలైన కర్రెగుట్ట, నాడ్‌పల్లి, పుజారి కంకేర్ ప్రాం తాల్లో 10వేల మందితో భద్రతా బల గా లు కూంబింగ్ మొదలుపెట్టాయి.

ఛత్తీస్ గఢ్ డీఆర్జీ, తెలంగాణ గ్రేహౌండ్స్, మహా రాష్ట్ర సీటూ బలగాలు సంయు క్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నాయి. మావో యిస్టులకు ఆహారం, నీరు సరఫరా కాకుండా భద్రతా బలగాలు పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్నాయి. దీంతో మావోయిస్టులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఈ కార ణంగా మావోయిస్టులకు ఆహారం, తాగు నీటి కొరత ఏర్పడుతున్నది.

౪ నెలలకు సరిపడా ఆహారం ఉన్నా వినియోగించు కోలేని పరిస్థితి ఏర్పడింది. శాంతి చర్చ లకు సిద్ధమంటూ మావోయిస్టులు లేఖలు విడుదల చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. దీనికి తోడు ఎండల తీవ్రతకు మావోయిస్టులు వడదెబ్బకు గురవుతున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం మావోయిస్టు లేఖలను లెక్కచేయక మరణ మృదంగానికి ఢమరుకం మోగిస్తున్నది. కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నా రని గాలింపు ముమ్మరం చేస్తున్నది.

మావోయిస్టు కీలకనేతలైన హిడ్మా, దామోదర్, దేవా, వికాస్‌లు ఇప్పటికే భద్రతా బలగాలకు చిక్కినట్టు భావిస్తున్నారు. ఈ క్రమంలో భద్రత దళాల తూటాలకు బలి కావడమా లేదా లొంగిపోవటమా అనేది మాత్రమే శరణ్యంగా మారింది. కర్రెగుట్ట కొండల గుండా వెళ్లే ఒక చిన్న నది ఆ ప్రాంతంలో నంబి, నీలం సారాయ్, లంకపల్లి వంటి మూడు జలపాతాలు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నాయి.

ఇన్నాళ్లు మావోయిస్టులకు ఈ కొండలలో సంవత్సరమంతా నీళ్లు దొరికేవి. అయితే సైనికుల కర్రెగుట్ట ఆపరేషన్ కారణంగా మావోయిస్టులకు నీటి కొరత ప్రారంభమైనట్టు తెలుస్తున్నది. ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు ఆహారం, ఇతర సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం అందుతున్నది. మావోయిస్టులు సుమారు 4 నెలల రేషన్ తీసుకున్నప్పటికీ, కర్రెగుట్ట కొండల్లో సైనిక శిబిరం ఉండటంతో వాటిని వినియోగించుకునే పరిస్థితి ఏర్పడింది. 

కర్రెగుట్టలో మావోయిస్టు అగ్రనాయకులు?

కర్రెగుటల్లో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తిష్ట వేశారని భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, సెంట్రల్ కమిటీ సభ్యుడు దామోదర్, సెంట్రల్ కమిటీ సభ్యుడు బుండి ప్రకాష్, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆజాద్, వీరితోపాటు చంద్రంజే, సుజాటా, కటరం చంద్రరెడ్డి, విజ్జో, ఉర్మిలా, గంగా, మంగ్డు, అభయ్, పాపారావ్, దేవా, దండకరన్యల కోసం కర్రెగుట్టలో భద్రత బలగాలు వేట సాగిస్తున్నాయి. వీరంతా కర్రెగుటల్లో ఉన్నారా లేరా అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. 

4౦మంది సైనికులకు వడదెబ్బ

కాగా కర్రెగుట్ట వద్ద మోహరించిన సైనికులు ఎండతీవ్రతకు నిర్జలీకరణానికి గురయ్యారు. సుమారు 40 మందిని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మీ హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సైనికులు వడదెబ్బకు గురవుతున్నారు. అలాగే కర్రెగుటల్లో దాగివున్న మావోయిస్టులకు తాగునీరు కరువు ఏర్పడినట్టు తెలుస్తున్నది. 

లొంగిపోండి లేదా చచ్చిపోండి

‘ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత భయంకరమైన వేట. మావోయిస్టులు లొంగిపోవడం లేదా చచ్చిపోవడం అనే రెండు ఎంపికలు మాత్రమే ఉన్నాయి’ అని సీనియర్ సీఆర్‌పీఎఫ్ అధికారి పేర్కొన్నారు. ‘ప్రతి రాయి ఒక ట్రాప్ కావొచ్చు. ప్రతి చెట్టు కొమ్మ ఒక స్నైపర్ కావొచ్చు’ అని బస్తర్  ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. కర్రెగుట్ట కొండలను వందలాది ఐఈడీలతో నింపేశామని గ్రామస్తులు ఎవరూ అటువైపు రావొద్దని మావోయిస్టు శాంత పేరుతో లేఖ విడుదలైనా కానీ బలగాలు వెనక్కి తగ్గట్లేదు. ఈ ఏడాదిలో కేవలం మూడు నెలల్లోనే 142 మంది మావోయిస్టులు హతమయ్యారు.  

చర్చలకు సిద్ధం.. కాల్పులు విరమించండి

శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కాల్పులను విరమించుకోవాలని కోరుతూ రూపేశ్ (నార్త్, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పేరు మీదుగా శుక్రవారం మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. శాంతి చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని తమ పార్టీ కోరుకుంటుందని, అందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

శాంతి చర్చల కోసం తమ పార్టీ కేంద్ర కమిటీ లేఖలు కూడా జారీ చేసిందని, విశ్వాస రాహిత్యాన్ని తొలగించేందుకు తమవైపు నుంచి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఉద్దేశం వేరేలా కనిపిస్తోందని, శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ అణచివేత, హింసాకాండ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

దీని ఫలితంగానే -తెలంగాణ సరిహద్దు బీజాపూర్‌లో భారీ సైనిక ఆపరేషన్‌ను ప్రారంభించారని ఆరోపించారు. బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కగార్ సైనిక్ ప్రచారాన్ని నెల పాటు వాయిదా వేయాలని కోరారు. తమ విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.