calender_icon.png 25 October, 2024 | 3:51 AM

సొసైటీ రియల్ దందానా?

25-10-2024 01:47:21 AM

  1. సభ్యత్వ నమోదు, రియల్ వ్యాపారాన్ని
  2. వెంట నిలిపివేయండి
  3. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కొత్త సభ్యత్వ నమోదుతోపాటు ఒక ప్రైవేట్ వెంచర్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని తక్షణమే నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట వద్ద మంచిరేవులలో జూబ్లీహిల్స్ 4 పేరిట నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందం అమలును నిలిపివేసింది.

సొసైటీస్ రూల్స్, కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లుకు వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడాన్ని ఆక్షేపించింది. తదుపరి విచారణ జరిగే నవంబర్ 14 వరకు తమ మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతివాదులైన వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి, కో ఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్, జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్‌కు నోటీసులు జారీచేసింది.

సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలపై తాను ఫిర్యాదు చేసినా అధికారులు ఏ చర్యలూ తీసుకోలేదంటూ వ్యాపారవేత్త జ్యోతిప్రసాద్ కొసరాజు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ సొసైటీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని న్యాయవాది వై రామారావు తెలిపారు.

స్పెషల్ క్యాడర్ డిప్యూటీ రిజిస్ట్రార్ (విచారణాధికారి) విచారణ నివేదికను తుంగలో తొక్కి సొసైటీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త సభ్యులను చేర్చుకునే ప్రక్రియ చేపట్టడం చెల్లదని వాదించారు. ఒక ప్రైవేట్ వెంచర్‌తో ఒప్పందం చేసుకుని రూ.5 లక్షలు చెల్లించి స్థలాన్ని బుక్ చేసుకోవాలనే షరతు విధింపు దారుణమని అన్నారు.

సుమారు 1,800 మంది సభ్యులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సొసైటీని వాడుకోవడాన్ని అడ్డుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ సెప్టెంబర్ 24న వినతిపత్రం అందిందని, అయితే అది పిటిషనర్ ఇచ్చింది కాదని తెలిపారు.

ఈ నెల 9న పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రం రిజిస్ట్రార్ పరిశీలనలో ఉందని చెప్పారు. కౌంటర్ దాఖలుకు సమయం కావాలని కోరారు. తదుపరి విచారణ వరకు కొత్త సభ్యతాలతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పంద అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.