calender_icon.png 5 October, 2024 | 4:53 AM

సన్నాలు సాధ్యమా?

05-10-2024 02:52:41 AM

జనవరి నుంచి పేదలు, విద్యార్థులకు సన్నబియ్యం

సంవత్సర అవసరం దాదాపు ౩౦ లక్షల టన్నులు

ఇంకా ప్రారంభంకాని ధాన్యం కొనుగోలు ప్రక్రియ

సర్కారు తేరుకొనేలోపే ప్రైవేటుకు నాణ్యమైన ధాన్యం

సర్కారు సన్నాల కొనుగోలు లక్ష్యం ౪౭ లక్షల టన్నులు

అంతా అయిపోయాక కొనేది నాణ్యత లేని ధాన్యమే

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు, స్కూళ్లు, అంగన్‌వాడీలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తిగా సన్నబియ్యమే సరఫరా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది.

ఇందుకోసం నెలకు కనీసం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. అంటే ఏటా కనీసం ౩౦ లక్షల టన్నులు.. సన్నాలు ఎక్కువగా వచ్చేది వానకాలం సీజన్‌లోనే.. యాసంగి సీజన్‌లో రా రైస్ వచ్చేది చాలా తక్కువ. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వానకాలం సీజన్‌లో వడ్ల సేకరణకు ఇంకా ప్రణాళిక రూపకల్పనే పూర్తిచేయలేదు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రాథమిక దశలోనే ఉన్నది.

మరోవైపు రైతులు ఇప్పటికే పంటకోతలు మొదలుపెట్టిన వచ్చిన ధాన్యం వచ్చినట్లు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా తెరిచేది ఎప్పుడు? సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు అందించేది ఎప్పుడు? వారి నుంచి బియ్యం తీసుకొనేది ఎప్పుడు? ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం చెప్తున్నట్లు వచ్చే జనవరి ఒకటి నుంచి పేదలకు, విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు.  

ప్రతి నెలా 2.5 లక్షల టన్నులు

వచ్చే జనవరి 1 నుంచి రేషన్ కార్డుదారులతోపాటు ప్రభుత్వ వసతిగృహాలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలకు సన్న బియ్యాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకుంది. అందుకోసం ప్రతి నెలా 2.5 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం. ఇంత మొత్తంలో బియ్యం అందుబాటులో ఉంచాలంటే నెలకు దాదాపు 3.73 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.

ఒక క్వింటాలు ధాన్యం మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం వస్తుందని ఎఫ్‌సీఐ నిబంధనల్లో ఉంది. ఈ లెక్కన నెలకు 3.73 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున సంవత్సరానికి సుమారు 45 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం అవసరం పడుతుంది. ప్రభుత్వం కూడా ఈ వానకాలంలో 47 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించింది.

58 శాతం సన్నరకాలే

రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష ఈ ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడిపై వ్యవసాయ శాఖ తన అంచనాలను వెల్లడించింది. మొత్తం 66.73 లక్షల ఎకరాల్లో ఈ సారి వరి సాగయ్యింది. 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మొత్తం విస్తీర్ణంలో సుమారు 58 శాతం ఈసారి సన్నరకం వరిని సాగుచేసినట్టు ఆ శాఖ పేర్కొంది.

ఈ లెక్కన చూసుకుంటే సుమారు 81 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వస్తుంది. ఇందులో సుమారు 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మరో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యాపారులు, రైతుల తమ కుటుంబ అవసరాలకు, స్థానిక ప్రజల అవసరాలకు ఉపయోగించుకుంటారని అంచనా వేశారు. 

మిల్లర్లతో కుదరని ఒప్పందం

రాష్ట్రంలో వరి కోతలు మొదలై పక్షం రోజులు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభు త్వం ఒక్కటంటే ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రం కూడా తెరవలేదు. మరోవైపు పొలాల వద్దకే వెళుతున్న ప్రైవేటు వ్యాపారులు అక్కడే కాంటాలు పెట్టి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇటువైపు మిల్లర్లతో ప్రభుత్వం మిల్లింగ్‌పై ఇంకా ఒక ఒప్పందానికి రాలేదు.

25 శాతం బ్యాంకు గ్యారెంటీ నిబంధన పెట్టాలని పౌరసరఫరాల సంస్థ ఆలోచిస్తున్నా.. దీనిపై సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ఈ తతంగం పూర్తవడానికి 4౦ రోజులైనా పడుతుంది. ఆ తరువాతనే మిల్లర్లకు ధాన్యం ఇస్తారన్నమాట.

ఈ లెక్కన చూసుకొంటే జనవరి ఒకటి నాటికి సన్నరకం బియ్యం అందుబాటులోకి వస్తుందా అనేది అనుమానమే. ముందుగానే ధాన్యం కొనుగోలు చేసినా మిల్లర్లతో అగ్రిమెంట్ల ఆలస్యం కారణంగా ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ధాన్యం రంగుమారితే ఆ రకంగానూ నష్టమే. ఈ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి సన్న బియ్యం పంపిణీ సాధ్యమయ్యేలా కనపడటం లేదు.

బహిరంగ మార్కెట్లో లాభాలు

నిజంగా ప్రభుత్వం నిర్దేశించుకొన్న 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించాలంటే ఇప్పటికే కొనుగోళ్లు మొదలుపెట్టాలి. గతంలో చాలా సార్లు ఇలా లక్ష్యం నిర్దేశించుకోవడం.. చివరకు ధాన్యం లేదని కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగింది. పంట కోసిన తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచటానికి రైతు ఆసక్తి చూపడు. ఓ పైస అటూ ఇటూ అయినా అమ్ముకోవాలని చూస్తుంటారు.

కోతలు మొదలు కాగానే వచ్చే ధాన్యంలో నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే కోతల ప్రారం భంలోనే ధాన్యాన్ని దక్కించుకోవటానికి ప్రైవేటు వ్యాపారులు ఎగబుతారు. ఓ రూపాయి ఎక్కువ పెట్టి అయినా కొనటానికి ముందుకు వస్తారు. పైగా బహి రంగా మార్కెట్లో ఇప్పుడు సన్న బియ్యానికి అద్భుతమైన డిమాండ్ ఉన్నది. ప్రభుత్వం ఇచ్చే ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇస్తే మిల్లర్లకు మిగిలేది చాలా తక్కువ.

నేరుగా రైతు నుంచే సన్న రకాలను కొనుగోలు చేస్తే ఆ బియ్యాన్ని కిలో రూ. 55 నుంచి రూ.70 వరకు అమ్ముకోవ చ్చు. ప్రభుత్వ ధర (రూ.40 నుంచి రూ. 45 వరకు)తో పోల్చితే కిలోకు రూ. 20 నుంచి రూ.25 వరకు లాభం వస్తుం ది. అందుకే కోతలు మొదలుకాగానే ప్రైవే టు వ్యాపారులు ధాన్యం కోసం ఎగబడుతారు. ఇప్పుడు అదే జరుగుతున్నది.