- తెలంగాణ ఊటీ.. ఈ అటవీప్రాంతం
- వేలాది రకాల ఔషధ మొక్కలకు ఆలవాలం
- ఇసుమంతైనా కల్తీ లేని ‘ఆక్సిజన్ నిధి’
- కొండ చుట్టూ రిసార్టులు.. ఆసుపత్రులు
- మహా నగరవాసులకు మంచి వీకెండ్ స్పాట్
అనంతగిరి అడవుల్లో సంజీవని మొక్కలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. సీతారాముడు వెంట వనవాసంలో ఉన్న లక్ష్మణుడు మూర్ఛపోగా, లక్ష్మణస్వామిని కాపాడేందుకు ఆంజనేయుడు సంజీవని చెట్టు కోసం ఏకంగా కొండను తీసుకెళ్తుండగా.. చేతిలో నుంచి జారి కొన్ని సంజీవని మొక్కలు అనంతగిరిలో పడిపోయాయని, ఇక్కడ సంజీవని వృక్షాలు ఉన్నందున ఇక్కడ పర్యటిస్తే రోగాలు నయమవుతాయనే తెలంగాణ ప్రజల విశ్వాసం. దీనిని నమ్మే గోల్కొండ నవాబులు సైతం కొండపై క్షయ, టీబీ వ్యాధి నివారణ ఆస్పత్రులను సైతం నెలకొల్పారు. నేటికీ టీబీ ఆస్పత్రి సేవలు కొనసాగుతుండడం విశేషం. మరి అలాంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విశేషాలపై ఓ లుక్కేద్దామా..?
(కావలి గోపాల్)/ వికారాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : తమిళనాడులోని ఊటికి వెళ్లాలని ఎంతోమందికి ఉంటుంది. కానీ దూరభావం, సమయం లేక వెళ్లలేకపోతారు. కానీ హైదరాబాద్ నగరానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న తెలంగాణ ఊటి గురించి తెలిసిన వారు మాత్రం నెలలో ఒక్కసారైన వెళ్లొస్తారు. అనంతగిరి కొండలు సముద్ర మట్టానికి 3,600 అడుగల ఎత్తులో ఉంటాయి. హైదరాబాద్‌లో ఉద్యోగాలతో నిత్యం బిజీగా గడిపే వేలమంది శని, ఆదివారాలతోపాటు సెలవు రోజుల్లో వికారా బాద్‌లోని అనంతగరి హిల్స్‌కు వెళ్లి సరదాగా గడుపుతారు. అక్కడి ప్రకృతి అందా లు, పక్షుల రాగాలు చూసి మైమర్చిపోతారు.
వికారాబాద్ పట్టణానికి అనంతగిరి కొండలు 1,879 అడుగల ఎత్తులో ఉండటంతో వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉండి వీచే చల్లటి గాలులు ఆహ్లాదాన్ని పంచుతాయి. అడవి అందాలతో పాటు బోటింగ్, అనంతపద్మనాభుడి దైవ దర్శనం కూడా చేసుకుంటారు. అన్నీ కలగలపి ఉన్న అనంతగిరి కొండల్లో పర్యటించడం ఒక మధురానుభూతిని ఇస్తుంది. ఒక్కసారి వెళ్లిన వారు వీలు చూసుకుని మరీ అనంతగిరికి వెళ్లొస్తారు. ఒక్క శని, ఆదివారాల్లోనే సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.
కోట్‌పల్లిలో బోటింగ్..
అనంతగిరి కొండల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కోట్‌పల్లి ప్రాజెక్టు ఉంది. ప్రకృతి ఒడిలో ఉండే ఈ ప్రాజెక్టు ఎప్పుడు నీటితో కళకళలాడుతుంటుంది. బోటింగ్ చేసే అవకా శమూ ఉండటంతో శని, ఆదివారాల్లో సందడిగా ఉంటుంది. కొండపై కట్టిన హరిత రిసా ర్టు పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. ఆ పక్కనే అటవీ శాఖ గెస్ట్‌హౌస్ పచ్చదనంతో ఉట్టిపడుతుంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యూ నుంచి అనంతగిరి అందాలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. అనంతగిరి అడవుల్లో తిరుగుతున్న జింకలు, నెమళ్లు, రకరకాల పక్షులు కనువిందు చేస్తాయి. అనంతగిరి నుంచి తాండూరు వెళ్లే మార్గంలోని ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న నంది విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అనంతగిరి వచ్చిన ప్రతి ఒక్కరు నంది విగ్రహం వద్ద ఫొటోలు దిగకుండా వెళ్లరు.
మూసీ నది పుట్టిన ప్రాంతం
కృష్ణానదికి ఉపనది అయిన మూసీ నది ఒకప్పుడు సాగు, తాగునీటికి ప్రధాన ఆధారం. మూసీ నది అనంతగిరి కొండల్లో నే పుట్టింది. అ క్కడి నుంచి హైదరాబాద్ మీదుగా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మూసీ నది మొత్తం బేసిన్ వైశాల్యం 4,329 చదరపు మైళ్లు. ఇది కృష్ణానది బేసిన్ వైశ్యాలంలో 4.35 శాతం. 1980వ దశకంలో హైదరాబాద్ శివారుల్లోని పారిశ్రా మిక ప్రాంతాల్లోని వ్యర్థాలను మూసీలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువగా మారింది.
ప్రకృతి ఒడిలో అనంత పద్మనాభుడు..
అనంతగిరిలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం 1,505 హెక్టార్ల దట్టమైన అడవుల్లో విస్తరించి ఉంది. ఆలయం చుట్టూ రెండు కిలోమీటర్ల మేరా కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ కొండలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అనంతుడి గురించి భక్తులు అనేక కథలు చెప్పుకుంటారు. కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయంలో వెలసిన స్వామివారి మూల విగ్రహం అనంతగిరి కొండ నుంచే తీసుకెళ్లినట్లు చరిత్రలో ఉంది. 13వ శతాబ్దంలో గోల్గొండ నవాబు ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తి సహకారాలు అందించారని ప్రతీతి.
సీఎం రేవంత్‌రెడ్డి పైనే ఆశలు
ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు అనంతగిరి వివక్షకు గురైంది. ప్రత్యేక తెలంగాణలోనూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలోని కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయనపైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక నేతే సీఎం అయినందున అనంతగిరి అభివృద్ధి పరుగులు పెడుతుందని భావిస్తున్నారు. మరోవైపు స్పీకర్ కూడా వికారాబాద్ ఎమ్మెల్యేనే కావడం కలిసి వస్తుందని స్థానికులు భావిస్తున్నారు.
సినీ హీరోలకు సెంటిమెంట్
అనంతగిరి కొండల్లో, పద్మనాభ స్వామి ఆలయ సన్నిధిలో తెలుగు సినిమాల చిత్రీకరణ జరుగుతుంటాయి. ఇక్కడ చిత్రీకరించడం కొందరు సినీ హీరోలకు సెంటిమెంట్‌గా ఉంది. రవితేజ, మహేష్‌బాబు, సునీల్ వంటి హీరోలు ఇక్క డ తమ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తే విజయవంతం అవుతుందని నమ్ముతారు. చిరంజీవి హీరోగా నటించిన మృగరాజుతో పాటు నువ్వు టక్కరి దొంగ, అదుర్స్, లీడర్, మార్యద రామన్న వంటి అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయి. సీరియల్ షూటింగ్‌లు కూడా జరుగుతాయి.
రూ.100 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..
గతేడాది కేంద్ర ప్రభుత్వం అనంతగిరి అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేసింది. అప్పటి టూరిజం, సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి పనిచేసిన కిషన్‌రెడ్డి సైతం అనంతగిరిని సందర్శించారు. అనంతగిరి ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మొదటి విడతలో రాష్ట్ర టూరిజం శాఖ రూ.32 కోట్లతో డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి సమర్పించింది. ఈ రూ.32 కోట్ల పనుల టెండర్లను ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. అభివృద్ధి పనులపై ఎల్‌అండ్‌టీ ఇటీవల అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో వంద కోట్లు మంజూరు చేయిస్తానని స్పీకర్ తెలిపారు.
ఐదేళ్లలో రూపు రేఖలు మారుస్తా
రానున్న ఐదేళ్లలో అనంతగిరి రేపురేఖలు మార్చేస్తాం. అందుకు అవసరమైన నిధులను కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి పనులపై ఎల్‌అండ్‌టీ సంస్థ ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసింది.
గడ్డం ప్రసాద్‌కుమార్,
శాసన సభ స్పీకర్