13-03-2025 01:49:55 AM
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు, 8 మంది సాక్షుల వాంగ్మూలాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మేడిగడ్డ సందర్శన సందర్భంగా అనుమతులేకు ండా డ్రోన్ వినియోగించారని గతేడాది జూలై 20న మహదేవపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్కసుమన్ హైకోర్టులో పిటిష న్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ కేసు నమోదు చేయడంలో జరిగిన జాప్యానికి కారణం వెల్లడించలేదన్నారు. కేటీఆర్ తదితరులు సందర్శించిన మాట వాస్తవమేనని, అయితే ఇందులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు వాదనలు వినిపిస్తూ ఎలాంటి అనుమతి లేకుండా మేడిగడ్డను సందర్శించారనగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ మేడిగడ్డ సందర్శనకు అనుమతులు అవసరమా? అని ప్రశ్నించారు. దానికి సంబం ధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులున్నాయా అని అడిగారు.
పీపీ సమాధాన మిస్తూ మేడిగడ్డ జాతీయ భద్రతా అంశాల పరిధిలోకి వస్తుందని దీనికి సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 8 మంది సాక్షుల వాంగ్మూలాలున్నాయని తెలిపారు. సిబ్బంది విధులకు భంగం కలిగించడమే కాదుఅధికారిక రహస్యాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌తో చిత్రీకరించారన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి కేంద్రం నోటిఫికేషన్ కాపీ అందుబాటులో లేకపోవడంతో నోటిఫికేషన్ కాపీతోపాటు సాక్షుల వాంగ్మూలాలను పిటిషనర్ తరఫు న్యాయవాదికి, కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేశారు.