calender_icon.png 20 September, 2024 | 12:03 PM

కాదేదీ కల్తీకి అనర్హమా?

12-07-2024 12:00:00 AM

ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ గొడవే. ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఏ వస్తువును కొన్నా ‘అది కల్తీనా, అసలా’ అనే ప్రశ్న తలెత్తుతున్నది. అన్నింటిలోనూ కల్తీ ఉంటున్నది. కిరాణా సామాను నుండి ఆహార ధాన్యాల వరకు ప్రతిదీ కల్త్తీమయం అవుతున్నాయి. నేటి ఆధునిక యుగంలో రోజూ మనం తినేది కల్తీ ఆహారమే అంటే అతిశయోక్తికాదు. కల్తీ ఆహారం బారిన పడి అనారోగ్యం పాలవుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటున్నది. మన దేశం అనేక ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇదే అదునుగా ఎక్కువ డబ్బుకోసం మధ్యదళారీ వ్యవస్థ అన్నింటినీ కల్త్తీమయం చేస్తున్నది. కొన్ని వస్తువులకు సరైన ప్రొడక్ట్ తయారీ తేదీలు, ఎంఆర్‌పీలు ఉండవు. మరికొన్ని పేరుగాంచిన కంపెనీల బ్రాండ్స్ వాడుకొని కల్తీ వస్తువులను మార్కెట్‌లోకి దింపుతున్నారు. వంటనూనెలో మాంసం నుండి తీసిన నూనెను కలపడం గతంలో కలకలం రేపింది. అదే విధంగా ప్లాస్టిక్ బియ్యం ఉదంతం కూడా.

బిజినెస్ పేరుతో రాష్ట్రంలో విచ్చలవిడిగా హోటల్స్, రెస్టారెంట్స్ పెరుగుతున్నాయి. కార్పొరేట్ శక్తుల జోరు ఎక్కువైంది. హైదరాబాద్‌లో పెద్ద రెస్టారెంట్లలో ఆహారం ఎలా ఉందో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో బట్టబయలైంది. కిచెన్‌లలో అపరిశుభ్రత, కుళ్లిన మాంసం, చేపలు, గుడ్లతో వండిన ఆహార పదార్థాలు. ఇదే తంతు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉంది. అయినా కూడా అధికారులు దాడులు ఎక్కువ చేయడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో కల్తీ చేసేవాళ్ళు జేబులు నింపుకొంటున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నగరాలలో ఉద్యోగస్తులు ఆదివారం వస్తే ఏదో రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్ళి కాలక్షేపం చేద్దామనుకునే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది.

కల్తీ ఆహారం, వస్తువులు తయారు చేసి అమ్మితే చట్ట ప్రకారం శిక్షలు విధించవచ్చు. కానీ, వీటిని అమలు పరిచిన దాఖలాలు చాలా తక్కువ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కల్తీ చేస్తే సెక్షన్ 274 బిఏన్‌ఎస్ ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష పడే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల కొరతకూడా ఎక్కువగానే ఉంది. అధికారులను పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్ద మొత్తంలో ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. దీంతో మనిషి ఆయుర్దాయం తగ్గుతూ పోతుంది. ఇప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం 68 ఏళ్లుగా ఉంది. ఈ కల్తీవల్ల అదింకా దిగజారిపోతుంది. బీపీలు, షుగర్ లాంటి జబ్బులవల్ల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గట్టి చర్యలు తీసుకోవాలి. మీడియాతోపాటు సమాజం కూడా కల్తీ వ్యాపారాలపై సమరం చేయాల్సిన అవసరం ఉంది. 

కిరణ్ ఫిషర్