calender_icon.png 21 November, 2024 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డి ఉగ్రవాదా?

21-11-2024 01:53:28 AM

  1. పార్కులో అరెస్టుపై న్యాయమూర్తి విస్మయం 
  2. సుప్రీం గైడ్‌లైన్స్ ఎందుకు పాటించలేదు?
  3. పోలీసుల తీరుపై హైకోర్టు సందేహాలు 
  4. విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్, నవంబర్ 20(విజయక్రాంతి): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన తీరుపై హైకోర్టు పలు సందేహాలను లేవనెత్తింది. నరేందర్‌రెడ్డి  పరారీలో లేనప్పుడు కేబీఆర్ పార్కులో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది.

ఇంట్లోనే అరెస్టు చేశామని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు చెప్పడంతో స్పందిస్తూ.. అదే నిజమైతే అరెస్టు చేసే ముందు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సమాచారాన్ని నరేందర్‌రెడ్డి ఇంట్లోని వాళ్లకు కాకుండా థర్డ్ పర్సన్ సలీమ్‌కు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేసేందుకు వెళ్లినప్పుడు అరెస్టు చేయడానికి నరేందర్‌రెడ్డి ఏమైనా తీవ్రవాదా? అని నిలదీసింది.

పోలీసులు అరెస్టు నిబంధనలను ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది. ఇంట్లోనే అరెస్టు చేసి ఉంటే ఆయన భార్య లేదా పిల్లలు లేదా ఇంట్లో ఉండే ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. అరెస్టు చేసే ముందు సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది.

అరెస్టు ప్రక్రియను ఆక్షేపించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ  నిమిత్తం భూసేకరణ చేపట్టే క్రమంలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన కారణమని పేర్కొంటూ ఆయనను పోలీసులు తొలి నిందితుడిగా కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఈ నెల 13న కొడంగల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులను ప్రశ్నించింది. 

దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్ర వివరాలు ఎందుకు ఇవ్వలేదని అడిగింది. తీవ్రగాయాలైనట్టు రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్టు ఎలా రాస్తారనే సందేహాన్ని లేవనెత్తింది. పార్కులో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారని, కింది కోర్టు యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చిందని, వాటిని రద్దు చేయాలని నరేందర్‌రెడ్డి  తరఫు సీనియర్ అడ్వొకేట్ గండ్ర మోహన్‌రావు వాదించారు.

రాజకీయ కుట్రతో పిటిషనర్‌ను కేసులో ఇరికించారని చెప్పారు. రైతులను ఉసిగొల్పి అధికారులపై దాడికి నరేందర్‌రెడ్డి కారణమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు ప్రతివాదన చేశారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

అయితే, లంచ్ తర్వాత తిరిగి న్యాయమూర్తి ఎదుట పీపీ హాజరై, పోలీసుల వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని, రిమాండ్ ఉత్తర్తులను రద్దు చేయవద్దని రాతపూర్వకంగా అఫిడవిట్ వేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. 

అరెస్టుకు కారణాలూ వెల్లడించలేదు 

వికారాబాద్ జిల్లా కొడంగల్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పట్నం నరేందర్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భూసేకరణలో భాగంగా ప్రజాభిసేకరణ చేపట్టిన అధికారులపై దాడితో తనకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. ఆ దాడి ఘటనలో నిందితుల వాంగ్మూలం మేరకు తనను అన్యాయంగా నిందితుడిగా చేర్చారని ఆరోపించారు.

తన అరెస్టుకు పోలీసులు కారణాలు కూడా వెల్లడించలేదని చెప్పారు. తనతోగానీ తన న్యాయవాదితోగానీ సంప్రదించే అవకాశం కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని, మొక్కుబడిగా ఇచ్చిన రిమాండ్ డైరీని కింది కోర్టు ఆమోదించడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. 

అధికారులపై దాడి సంఘటనలో పాల్గొన్న ప్రజలకు, ఆ అధికారులకు శత్రుత్వం లేదని, వాళ్ల మధ్య వైరం కూడా లేదనే అంశాన్ని గుర్తించాలని అన్నారు. దురుద్దేశం, రాజకీయ ప్రేరేపితంతో తనపై కేసు నమోదు చేశారని, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరారు. తుది తీర్పు వెలువరించేలోగా రిమాండ్ తీర్పుపై స్టే విధించాలని హైకోర్టుకు  విజ్ఞప్తి చేశారు.

పోలీసులపై నరేందర్‌రెడ్డి భార్య కోర్టు ధిక్కరణ పిటిషన్

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారని పేర్కొంటూ పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్నం శ్రుతి హైకోర్టులో బుధవారం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఒక వ్యక్తిని అరెస్ట్‌చేసే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను డీకే బసు కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని, వీటిని ఉల్లంఘిస్తూ అరెస్ట్ చేసినందున కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరారు. ఐజీపీ వీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కే నారాయణరెడ్డి, బొమ్మరాస్‌పేట ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.

పట్నం కస్టడీ పిటిషన్ 22కు వాయిదా 

వికారాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): లగచర్ల దాడి కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని బుధవారం పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఏ1గా ఉన్న నరేందర్‌రెడ్డిని పోలీసు కస్టడికి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి తరఫు న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, శుభప్రద్ పటేల్, లక్ష్మణ్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. విచారణ అనంతరం తన తరుపు న్యాయవాదులతో నరేందర్‌రెడ్డి కోర్టు ఆవరణలో మాట్లాడారు.

సీఎం రేవంత్‌రెడ్డి పతనం కొడంగల్ నుంచే ప్రారంభమైందని నరేందర్‌రెడ్డి అన్నారు. రైతుల తరపున పోరాడితే తనపై సీఎం అక్రమల కేసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు, ఇంటలిజెన్స్ వైఫల్యంతోనే లగచర్ల దాడి జరిగిందని అభిప్రాయ పడ్డారు. కోర్టులపై తనకు పూర్తి గౌరవం ఉందని, నిర్దోశిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తంచేశారు.