calender_icon.png 7 November, 2024 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ హవాకు మూలం?

19-04-2024 12:10:00 AM

రెండు పర్యాయాలు అధికారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని, ముచ్చటగా మూడో దఫాకూడా దేశంలో పాలనా పగ్గాలు చేజిక్కించుకోవాలని శతథా ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ‘హవా’కు మూలం ఏమిటి? 

ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆయన్నే ఎందుకు గెలిపించాలి? ప్రత్యా మ్నాయం లేకనా? లేక, దేశంలోని మెజారిటీ ప్రజల మత విశ్వాసాన్ని చూరగొనడమేకాక అభివృద్ధి విషయంలోనూ ఆయన తనదైన ముద్రతో సాగుతున్నందుకా? గడచిన పదేళ్లుగా నరేంద్ర మోదీ  ఆధ్వర్యాన నడిచిన బీజేపీ సర్కారు దేశానికి చేసిన అభివృద్ధి పనులు ఎన్నో కొన్ని లేకపోలేదు. పై సందేహాలకు కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానాలు ఒకింత ఆలోచింపదగ్గవిగానే వున్నాయి. రోడ్లు, రహదారులు, వంతెనలు వంటి మౌలిక వసతుల కల్పన, జాతీయ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ, వ్యవహారాలను చెక్కుచెదరకుండా ఉంచగలగటం, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడం.. వంటి కొన్ని మంచి పనులు వాటిలో వున్నాయి. ‘అసలు, దేశంలో మోదీ హవా ఏమీ లేదు’ అన్న ప్రతిపక్షాల విమర్శను ప్రస్తుతానికి పక్కన పెట్టి, సానుకూల విషయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొంటే, అందులోని వాస్తవం బోధపడుతుంది. 

ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరలేదు!

భారత దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో సవ్యంగా వున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గడచిన కొన్నేళ్లుగా పలు రంగాలలో భారతీయులు గణనీయమైన అభివృద్ధిని సాధించారని, ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట మరింత బాగా ఇనుమడిస్తున్నదని కూడా వారు పేర్కొన్నారు. భారతదేశం భవిష్యత్తు మీద తాము పూర్తి భరోసాతోనే వున్నట్టు వారు చెప్పారు. పెద్ద ఆర్థిక వ్యవస్థలతోకూడిన దేశాలతో పోల్చినప్పుడు మన దేశం ‘జీడీపీ’ వేగంగా పెరుగుతున్నదని వారన్నారు. 2024, 2025 ఆర్థిక సంవత్సరాలలో సగటున 6.7 శాతం మేర పెరుగుదల నమోదు కానున్నట్టు కూడా వారు తెలిపారు. 

చైనా సంస్కరణలను గుర్తుకు తెస్తున్నారు!

నరేంద్ర మోదీని చైనా విప్లవకారుడు, అక్కడి రాజనీతివేత్త డెంగ్ జియావో పింగ్ (1904 1997)తో పోల్చుతున్నారు. ఆ దేశంలో డెంగ్ ప్రవేశపెట్టిన అద్భుత సంస్కరణలను గుర్తుకు తెచ్చేలా నరేంద్ర మోదీ కృషి చేస్తున్నట్టు కూడా విశ్లేషకులు కితాబు నిచ్చారు. దేశంలోని మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజలు బీజేపీ పాలనపట్ల సంతృప్తితోనే వున్నట్టు వారు నమ్ముతున్నారు. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జరిగిన మౌలిక వసతుల కల్పనను వారు ఉటంకిస్తున్నారు. రోడ్లు, జాతీయ రహదారులు, వంతెనలు, రైల్వేల అభివృద్ధి వంటి  విషయాలలో మోదీ సర్కారు చక్కగా పని చేసినట్టు వారు చెప్పారు. వందే భారత్ రైళ్లు, ముంబైలో ఏర్పాటైన (జాతీయ స్థాయిలో) అతి పొడవైన సముద్ర వంతెన వంటివి వాటిలో వున్నట్టు పేర్కొన్నారు. గత అయిదేళ్లలో దేశవ్యాప్తంగా మౌలిక రంగంలో సుమారు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయం జరిగినట్టు చెప్పారు.

ఉత్పాదక రంగంలో గణనీయ ప్రగతి

చైనాలోని అసాధారణ వేగవంతమైన అభివృద్ధితో పోల్చలేక పోతున్నప్పటికినీ ఉత్పాదక రంగంలో గత కొన్నేళ్లుగా గణనీయ ప్రగతి నమోదైనట్టు పై విశ్లేషకులు తెలిపారు. విదేశాలకు చెందిన కంపెనీలను దేశానికి రప్పించి, పెట్టుబడులు పెట్టించడంలోనూ మోదీ ప్రభుత్వం విశేష కృషి చేసిందనీ అన్నారు. గతేడాది భారతదేశానికి చెందిన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 100 శాతం వరకూ పెరిగాయని, వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలోని ‘ఐఫోన్స్ అసెంబ్లింగ్’లలో మన దేశం 25 శాతం వాటాను సొంతం చేసుకోగలదనీ వారు వెల్లడించారు. పరిశ్రమల రంగంలో ఉత్పాదకతను మరింతగా పెంపొందించడానికిగాను సుంకాల నియమ నిబంధనలు, అధికార యంత్రాంగ వ్యవస్థ విషయాలలో మరింత మేలైన కృషి జరపవలసి ఉంటుందని కూడా వారు సూచించారు.

ప్రపంచ స్థాయిలోనూ ప్రధాని మోదీ సవ్యమైన పాత్రనే పోషించినట్లు విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి దేశాధినేతలైన జోబైడెన్, మాక్రన్‌ల నుండి పుతిన్ వంటివారి వరకు అందరితోనూ ఆయన సత్సంబంధాలనే నెరిపారని, ముస్లిమ్ దేశాలు (ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఎఈ) సైతం ఆయనకు ఎర్ర తివాచీ పరిచాయని వారు గుర్తు చేశారు.

దోర్బల బాలశేఖరశర్మ