ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి) : కేసీఆర్ కుటుంబం పదేళ్లు అధికారంలో లక్షల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారని ప్రభు త్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీ ర్ అలీ ఆరోపించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తాము 40 ఏళ్లు రాజకీయాల్లో ఉండి కూడా ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం సమ యంలోనూ కేసీఆర్ కుటుంబం ఆక్రమంగా ఆస్తులు కూడబెట్టిందని ఆరోపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ ఆస్తులు రూ.4.32 కోట్లు ఉంటే 2014లో అవి రూ.8 కోట్లకు పెరిగాయన్నారు. ఉద్యమంలోనూ కేసీఆర్‌కు ఆస్తులు పెరిగాయ ని, ఎవరైనా ఉద్యమం చేస్తే ఆస్తులు అమ్ముకుంటారని, కానీ కేసీఆర్ ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు.
ఇక 2018 ఎన్నికల్లో రూ.41 కోట్లకు, 2023లో రూ.53 కోట్ల వరకు ఆస్తులు పెరిగాయని షబ్బీర్‌అలీ తెలిపారు. 2009లో హరీశ్‌రావుకు రూ.67 లక్షల ఆస్తులుంటే, 2023 వరకు రూ.24 కోట్లకు పెరిగాయని, ఎమ్మెల్సీ కవితకు ఆస్తులు 2014లో రూ.4 కోట్లు ఉంటే ఎమ్మెల్సీ అయ్యే సమయానికి ఆమె ఆస్తులు రూ.39 కోట్లకు పెరిగాయని వివరించారు. ఆస్తులు పెంచుకోవడంలో కేసీఆర్ వద్ద ఏమైనా అల్లావుద్దీన్ అద్భత దీపం ఏదైనా ఉంటే చెప్పాలన్నారు. ఫార్ములావన్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.