calender_icon.png 23 February, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రోజులు మళ్లీ రావా!?

23-02-2025 12:41:36 AM

ఈ కాలంలో ఉమ్మడి కుటుంబం సాధ్యమేనా?  భిన్నమైన తరాలకు చెందిన వారంతా ఒకే ఇంట్లో హ్యాపీగా, కంఫర్ట్‌గా ఉంటున్నారా? అంటే అవునని చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే తరాలు మారే కొద్దీ కొత్త సౌకర్యాలు పుట్టుకొస్తున్నాయి. అంతమాత్రాన వెస్టర్న్ టాయిలెట్స్, షవర్ బాత్, గీజర్ వంటివి అవ్వాతాతలు ఆస్వాదించాలనీ లేదు.

మరి సుఖమైన పడకకు అలవాటు పడ్డ కొత్త తరం మెత్తని మాట్రిసెస్‌ను కాదని నులకమంచంలో పడుకోవడం సాధ్యమా? అది అయ్యే పని కాదు.. వేర్వేరు ఇళ్లలో ఉందామా? అంటే అలా అయితే ఇళ్లు ఉంటాయి కానీ.. కుటుంబ బంధాలుండవు. ఈ సమస్యకు పరిష్కారంగానే మల్టీ జనరేషన్ హోమ్స్ వస్తున్నాయి. 

ఇల్లంటే అందులో పాత పద్ధతులకు అలవాటుపడ్డ అవ్వా.. తాత.. ప్రస్తుత జీవనశైలి అలవర్చుకుంటున్న అమ్మ.. నాన్న, అడ్వాన్డ్స్ టెక్నాల జీని అణువణువునా నింపుకుంటున్న మనవళ్లు, మనవరాళ్లు ఉంటారు. ఈ రోజుల్లో పాతతరం వాళ్లు పల్లెల్లో.. ప్రస్తుత తరం వాళ్లు పట్టణాల్లో ఉంటే.. రాబోయే తరాల వారు విదేశాల్లో ఉండటం పక్కా.. వృత్తిరీత్యా ఇలా వేర్వేరు జీవనపయనం సాగుతున్నది. అయితే ఎన్ని మార్పులు వచ్చినా భారతదేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు మారుపేరు. కుటుంబమంతా ఒకే చోట కలిసిమెలసి ఉండాలని నమ్మే దేశం. దానికి పరిష్కారమే ఈ మల్టీ జనరేషన్ హోమ్స్.  

అందరూ ఒకే నీడలో..

ఇంట్లో ఎక్కువమంది ఉంటే ప్రైవసీ ఉండదనేది సత్యం. అందుకే మల్టీ జనరేషన్ హోమ్ డిజైన్ అత్యంత ముఖ్యం. అంటే లివింగ్ స్పేస్ సెపరేట్‌గా ఉండాలన్న మాట. ప్రత్యేకమైన గదులు, తలుపులు, కర్టెన్స్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ఇంట్లో చదువుకునే పిల్లలకు, కబుర్లు చెప్పుకునే వారికి, పని చేసేవారికి ఒకరికొకరు అంతరాయం కలిగించే అవకాశం ఉండదు.

అయితే కేవలం ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ పోతే మల్టీ జనరేషన్ హోమ్‌కు అర్థం లేకుండా పోతుంది. అందుకే కామన్ షేర్డ్ ఏరియాలు ఉండేలా చూసుకోవాలి. కిచెన్, డైనింగ్ హాల్, లివింగ్ రూమ్‌లను వీలైనంత విశాలంగా నిర్మించుకోవాలి. ఫ్యామిలీ అంతా కలిసి టైమ్ స్పెండ్ చేసేది అక్కడే కదా!.

ప్రయోజనాలు.. 

ఈ ఇళ్లతో ఆర్థికభారం తగ్గుతుంది. వేర్వేరుగా ఇళ్లలో ఉండేకంటే ఒకేచోట ఉంటే రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లుతో పాటు అనేక రకాల ఖర్చులూ తగ్గుతాయి.

ఇళ్లలో వృద్ధులుంటే చిన్నపిల్లలను చూసుకుంటారు. వారిపై కేర్ తీసుకుంటారు. టీనేజ్ పిల్లలుంటే వయసు పైబడిన వృద్ధులను చూసుకుంటారు. ఇలా సంపాదించే వారికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

ఒకేచోట ఉండటం వల్ల కలిసి భోజనం చేయడం, సరదాగా ముచ ్చట్లు చెప్పుకోవడం, ఒకరి అనుభవాలను ఒకరితో పంచుకోవడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి.

కష్టాలు వచ్చినప్పుడు తోడు గా కుటుంబ సభ్యులుంటే ఎమోషనల్ సపోర్ట్ లభిస్తుంది. 

అన్నింటికంటే ముఖ్యంగా ఇం ట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం వల్ల భద్రత ఉంటుంది. 

అభిరుచులతో..

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సులభంగా ఆధునీకరించుకునేందుకు వీలుగా బాత్రూమ్‌లను నిర్మించుకోవాలి.

ఓపెన్ ఫ్లోర్ ప్లాన్ చేసుకోవాలి. తద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ గదుల్లో పార్టీషన్స్, గోడలు తొలగించడం ద్వారా హాల్‌లా మారుతుంది. 

ఇంట్లో అందరి అభిప్రాయాలను తీసుకొని వారి అభిరుచులకు తగ్గట్టుగా ఇంటీరియల్ ఎంచుకోవాలి. 

రిలాక్స్ అయ్యేందుకు పూలతోట వంటివి ఏర్పాటు చేసుకోవాలి.