మోతె రవికాంత్ :
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రక్షణ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. రక్షణ శాఖ అధ్వర్యంలో భారత నావికాదళానికి సంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2,900 ఎకరాలలో విస్తరించి వున్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
మూసీ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణం కోసం 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు. వీటితో పాటు ఈ అడవిలో గల దామగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం, దేవాలయానికి చెందిన భూములు కూడా అస్తిత్వం కోల్పోతున్నాయి.
2007లోనే బీజం
అసలు ఈ దామగుండం హననం అయ్యే పరిస్థితులకు 2007 నుంచే బీజం పడింది అంటున్నారు అక్కడి ప్రజానీకం. అప్పట్లో కేంద్రంలో, ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వున్న హయాం 2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికాదళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. 2010లో ప్రతిపాదనలు పంపడంతో ప్రక్రియ మొదలైంది.
అయితే ఆ సమయంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తదనంతరం 2013లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనవంటి అంశాలతో కొంత మందగించినా, అటవీభూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచాయతీ తీర్మానాలు వంటి ప్రక్రియలు అన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటున్నారు.
అయితే పర్యావరణ ప్రేమికులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే వుండడంతో భూమి బదలాయింపు మాత్రం జరుగలేదు. కాగా గత జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘటితం అవుతున్నారు.
అయితే 1990లోనే ఒక నేవీ రాడార్ స్టేషన్ తమిళనాడులోని తిరునల్వేలి దగ్గరంలో గల విజయనారా యణం ప్రాంతంలో నిర్మించారు. సముద్ర మట్టానికి 240 అడుగుల ఎత్తు గల ఈ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ 3,000 ఎకరాల ప్రాంగణంలో దాదాపు 470 మీటర్ల వైశాల్యంతో కూడిన యాంటెన్నాతో నిర్మాణం చేశారు. మరొక నేవీ రాడార్ స్టేషన్ ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఏమిటో సరియైన వివరణ ఇవ్వడం లేదు.
దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో వున్నాయి.
ప్రభుత్వా లు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికాదళానికి అప్పజెప్పడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో దేశ రక్షణకు సంబంధించిన ప్రాజెక్టు అనే ప్రచారంతో చాలా మంది పర్యావరణ శాస్త్రజ్ఞులు దీనిపై నోరు మెదపడం లేదు.
నేలకూలనున్న 12 లక్షల వృక్షాలు
దామగుండంకు వెళితే యమగండం తప్పుతుందని ఇక్కడి చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల నానుడి. దాదా పు నాలుగైదు దశాబ్దాల క్రితమే ఎవరికైనా క్షయ వంటి వ్యాధులు వచ్చినప్పుడు, ఆ వ్యక్తిని ఈ అటవీ ప్రాంతం లో కొన్ని రోజులు ఉంచినప్పడు, ఇక్కడ ఉన్న స్వచ్ఛమైన వన మూలికలు, ఓషధీ గుణాలు కలిగిన చెట్ల వలన వచ్చిన గాలిని పీల్చడం వలన ఆ వ్యాధులు నశించిపోయిన చరిత్ర ఉంది.
ఇప్పుడు ప్రభుత్వం నావికాదళానికి అప్పజెప్పిన 2900 ఎకరాలలో భూమిలో దాదాపు 12 లక్షల చెట్లు నేలకూలనున్నాయి. అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదా పు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు.
దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేలకూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింక లు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్లె, అడవి పందులు, పెద్ద కొమ్ముల గల సాంబార్ జింక లు, చింకారా జాతి జింకలు వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి.
అంతేకాకుండా ఈ రాడార్ స్టేషన్ వల్ల వెలు వడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుపక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్రలేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధ్యత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం వంటి సమస్యలు పొంచివున్నాయి.
మూసీ అస్తిత్వానికే ముప్పు
ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచి దామగుండం స్వామిగా పేరుగాంచిన సత్యానందస్వామి మాత్రం నిరంతరం హెచ్చరిస్తూనే వున్నారు. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్గొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది.
ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరీవాహక ప్రాంతానికి కూడా విపరీతమైన ముప్పు పొంచి వుంది. అసలే కాలుష్యకాసారంలో కొట్టుమిట్టాడుతున్న మూసీనది ఈ ప్రాజెక్టుతో అస్తిత్వమే కోల్పోనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో, అసలు నదీ జన్మస్థలానికి ముప్పు పొంచి ఉన్న విషయం మరోసారి పరిశీలిస్తే మంచిదేమో.
మూసీతో పాటు ఈసా, కాగ్నా నదులు కూడా ఇక్కడే పుట్టాయి. మూసీ నది కృష్ణా నదికి తెలంగాణలో ప్రధాన ఉపనది అయితే, ఈసా, మూసీ నదికి ఉపనది. ఇక కాగ్నా నది ఇక్కడి నుంచి పశ్చిమానికి ప్రవహించి కర్నాటక ప్రాంతంలో ఉన్న భీమా నదిలో కలుస్తుంది. ఇప్పుడు ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వలన ఈ మూడు నదుల అస్తిత్వం ప్రమాదంలో పడింది.
రాజధానికి ప్రధాన ఆక్సిజన్ వనరు
ఈ దామగుండం అటవీప్రాంతం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి వున్న అడవులే. ఇప్పుడు 2900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే.
గతంలో ఏదైనా ప్రాజెక్టులు, పరిశ్రమల కోసం భూమిని, సహజవనరులను అప్పగించాలంటే ప్రజల అభీష్టాన్ని ప్రభుత్వాలు కొంతైనా పరిగణనలోకి తీసుకొనేవి. ఇప్పుడు ప్రభుత్వాలే అభివృద్ధి నినాదం పేరుతో సహజ వనరులను, ప్రకృతిని సామాన్య మానవులకు దూరం చేస్తుండడంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు.
నవీన అభివృద్ధి నినాదంతో ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ వంటి పదాలు, వాటిపై గొంతు విప్పుతున్న ప్రజలను అపహాస్యం చేయడం కొన్ని వర్గాలకు ఆనందదాయకం.
ఇప్పుడు ఇక్కడ కడుతున్న రాడార్ స్టేషన్ వలన స్థానిక ప్రజలకు ఎంత లాభం? తమ హక్కు అయిన స్వంత పర్యావరణాన్ని ధారపోసి వీళ్లైతే అభివృద్ధిని కోరుకోవడం లేదు కదా? పోనీ ఈ నిర్మాణం వలన స్థానిక ప్రజలకు ఏమైనా ఉపాధి అవకాశాలు కలుగుతాయా? విద్య, వైద్యం, కనీస మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందుతాయా?
ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరిజ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆయా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మానాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? తమ ప్రధాన హక్కు అయిన తమ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో లాక్కుంటుంటే దిక్కుతోచక వలసబాట పడుతున్నారు.
ఇలాంటి ప్రాజెక్టుల విషయాలలో ఏ రాజకీయ పార్టీల ప్రజాప్రతి నిధులైనా తమ స్వలాభం తాము చూసుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పటికీ అక్కడ స్థానిక నివాసాలు ఏర్పరచుకోరు కాబట్టి. అక్కడినుంచి గెలిచి నగరాలలో ఆవాసాలు ఏర్పరచుకుంటారు కాబట్టి అక్కడి విధ్వంసం ప్రభావం వారిపై, వారి కుటుంబాలు, వారసులపై పడదు.
కాబట్టి ఇప్పుడీ దామగుండం పరిరక్షణ, పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరయిన దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.
తెలంగాణ ప్రాంతానికి ప్రాణవాయువును అందిస్తున్న అటవీతల్లిని ఛిద్రం చేస్తూ, ఊపిరితిత్తులను చిదిమేస్తుంటే, ఇప్పటివరకూ ఉచితంగా వస్తున్న గాలిని పీలుస్తున్న ఏ మనిషి ఊరుకోడు. తనవంతు గొంతుక వినిపిస్తాడు. తనవంతు కర్తవ్యం నిర్వహిస్తాడు. కనీసం అప్పుడైనా ఈ ప్రభుత్వాలు పునరాలోచిస్తాయని ఆశిద్దాం!
వ్యాసకర్త అధ్యక్షులు, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్
సెల్: 94919 24345