నయనతార జీవితం ఆధారంగా ‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్‘ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించింది. ఈ నెల 18న ఈ డాక్యుమెంటరీ విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్‌ను ఇటీవల వదిలింది. ఆ వెంటనే నయనతారకు బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే.. నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి పని చేసిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ దాన్’. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి, వివాహం చేసుకున్నారు.
అయితే తాజా డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’లోని ముఖ్య విశేషాలను చూపించారు. డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల తర్వాత నయనతారకు ఆ చిత్ర నిర్మాత అయిన ధనుష్ నుంచి లీగల్ నోటీస్ అందింది. దీనిపై ఫైర్ అయిన నయన్.. ఆయనకు బహిరంగ లేఖ రాశారు. తండ్రి, సోదరుడి సపోర్ట్‌తో ధనుష్ పైకి వచ్చి గొప్ప నటుడయ్యారని కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. “ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని నేను ఇలా ఎదిగేందుకు ఎంతో పోరాటం చేయాల్సి వచ్చింది.
మీరు మాపై పెంచుకున్న శత్రుత్వం డాక్యుమెంటరీలో భాగమైన అందరినీ ఇబ్బంది పెడుతోంది. మా జీవితంలో భాగమైన ‘నానుమ్ రౌడీ దాన్’ దీనిలో లేకపోవడం బాధాకరం. దీనిలో సినిమా సన్నివేశాలను వినియోగించుకునేందుకు ఎన్‌ఓసీ కోసం రెండేళ్లుగా మీతో పోరాడుతున్నాం. పర్మిషన్ ఇవ్వకుండా ఇలా వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కడం దారుణం. మూడు సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు దాదాపు రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ ఇవ్వడం బాధాకరం.
ఇక్కడే మీ క్యారెక్టర్ ఏంటనేది తెలుస్తోంది. మీ నోటీసుకి మేము న్యాయబద్దంగానే సమాధానమిస్తాం. ఒక మనిషి ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు? ఈ లేఖ ద్వారా ఒక్కటే విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. తెలిసిన వారు విజయాలు అందుకుంటుంటే అసూయ పడకుండా సంతోషంగా తీసుకోండి.
ఈ విషయంలో కొన్ని కట్టుకథలు అల్లి, పంచ్ డైలాగ్‌లు చేర్చి ఆడియో విడుదల చేయవచ్చు. కానీ దేవుడున్నాడు. మా డాక్యుమెంటరీని మీరు కూడా చూడండి. మీ మనసు మారవచ్చు. ప్రేమను మాటల్లో కూడా చేతల్లోనూ చూపించండి” అని నయన్ పేర్కొన్నారు.