మహారాష్ట్ర సీఎం ఎంపికలో వీడని చిక్కుముడి
నేటితో ముగియనున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు
ఫడ్నవీస్‌కే మద్దతు తెలుపుతున్న అజిత్‌పవార్!
షిండేనే కొనసాగించాలని శివసేన పట్టు
lరొటేషన్ పద్ధతిలో ఇద్దరికీ అవకాశమిస్తారా?
అమిత్ షాతో చర్చ తర్వాత రానున్న క్లారిటీ!
ముంబై, నవంబర్ 25: మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం సాధించినా ఇప్పటికీ ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి వీడటం లేదు. ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే అవకాశం దక్కాలని బీజేపీ అంటుండగా మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన వాదిస్తోంది. బీహార్‌లో తక్కువ సీట్లు సాధించినప్పటికీ నితీశ్‌కుమార్‌ను సీఎంగా కొనసాగించినట్లు మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండేను మరోసారి సీఎం చేయాలని ఆయన వర్గం నేతలు కోరుతున్నారు.
అంతేకాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలంటే షిండేనే సీఎంగా కొనసాగించాలని శివసేన ఎంపీ నరేశ్ మస్కే కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్ మద్దతు తెలపడం గమనార్హం.
దేవేంద్రకే అజిత్‌పవార్ మద్దతు!
సీఎం ఎంపికపై ఇప్పటికే మహాయుతి కూటమి పార్టీల్లో చర్చలు జరు గుతున్న నేపథ్యంలో బీజేపీ నేత దేవేం ద్ర ఫడ్నవీస్‌కే ఎన్సీపీ చీఫ్ అజిత్‌పవార్ మద్దతు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, మహారాష్ట్ర సీఎం ఎవరనేది మిత్రపక్షాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఎన్సీపీ శాసనసభ పక్షనేతగా నన్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీజేపీ నుంచి ఫడ్నవీస్, శివసేనలో ఏక్‌నాథ్ షిండే ఎన్నికయ్యారు. మేం ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటాం అని పవార్ పేర్కొన్నారు.
అమిత్ షాతో చర్చ తర్వాత?
మహారాష్ట్ర శాసనసభ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆ లోపు ప్ర భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహాయుతిలోని భాగస్వామ్య పక్షాలు తమ తమ శాసనాసభ పక్ష నేతల ఎన్నికను పూర్తి చేశాయి. ఈ తరుణంలో మంగళవారం ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఒకరికే ఇస్తారా? లేదా రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారా? అనే అంశాలపై చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఫడ్నవీస్‌పైవే బీజేపీ మొగ్గు!
మహారాష్ట్రలో 2029 ఎన్నికలకు బీజేపీ సిద్ధమయ్యేందుకు దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా క్యాడర్‌లో నైతికత పెంపొందించడం తో పాటు దృఢమైన పాలన కోసం చూస్తోంది. అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్‌వైపే బీజేపీ మొగ్గు చూపుతోంది. పదవి కాషాయ నేతకే దక్కితే సంకీర్ణానికి సుస్థిరత లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండటంతో పాటు 2019 రాజకీయ పరిణాలు, ఎదురుదెబ్బలతో బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారని, పార్టీ పునరుజ్జీవనం కోసం సీఎం పదవి దక్కించుకోవాలని ఆ పార్టీ బలంగా కోరుకుంటోంది.
పీఠాన్ని కాపాడుకునేందు షిండే పోరాటం
ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడిపించిన షిండే... ఈ విజయం తన నాయకత్వానికి ఆమోదంగా భావిస్తున్నారు. ముఖ్యంగా లడ్కీ బెహెన్ వంటి పథకాలు ఇందులో కీలక పాత్ర పోషించాయని అంటున్నారు. అంతేకాకుండా శివసేనపై ఎమ్మెల్యేలపై తన పట్టును సుస్థిరం చేసుకోవడానికి షిండేకు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఎంతో అవసరంగా కనిపిస్తోంది. బాల్‌ఠాక్రే వారసుడిగా షిండేకే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టిన నేపథ్యంలో మళ్లీ అధికారం కోల్పోతే శివసేన వర్గం అస్థిరంగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్ధవ్ ఠాక్రే వర్గం వంటి వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు షిండే సీఎం కావాలని శివసేన నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.