18-04-2025 12:00:00 AM
కేంద్రంలో వరుసగా మూడు పర్యాయాలు అధికారంలోకి వచ్చి, దేశవ్యాప్తంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న బలమైన భారతీయ జనతా పార్టీ కి రాజకీయంగా దక్షిణ భారతంలో ఆశించిన స్థాయిలో పట్టు చిక్కడం లేదు. దానికి ఒక దశాబ్దంగా ఈ పార్టీ వేస్తున్న ఎత్తుగడలు, చేస్తున్న ప్రయోగాలు ఫలప్రదం కావ డం లేదు. 129 లోక్‌సభ స్థానాలు ఉన్న దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలలో బీజేపీ 29 లోక్ సభ స్థానాలకు మించి గెలువలేక పోయింది.
గత లోకసభ ఎన్నికల సందర్భంగా మిషన్ దక్షిణాది వ్యూహంలో భాగంగా 50కి పైగా లోక్‌సభ స్థానాలలో విజయం సాధించాలనే బీజేపీ ఆశలు నెరవేరక పోగా కేరళ, తమిళనాడులలో ఎన్ని ప్రయోగాలు చేసినా ఖాతానే తెరవలేదు. బలం ఉన్న కర్ణాటకలో గతం కంటే ఎనిమిది లోక్‌సభ స్థానా లు తగ్గితే, పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు లోక్‌సభ స్థానాలలో గెలువగ లిగింది.
కానీ, ఒక్క తెలంగాణలోనే గతం కంటే రెట్టింపు సంఖ్యలో 8 లోక్‌సభ స్థానాలలో విజయం సాధించి, పరువు కాపాడు కోగలిగింది. నిధుల కేటాయింపులో మోదీ ప్రభుత్వం దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని, లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది ప్రాబల్యం దెబ్బ తీయాలని చూస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.
గత లోక్‌సభ ఎన్నికలలో సొంత బలంతో దక్షిణాదిలో ఎదగాలనే రాజకీయ వ్యూహం ఫలించలేదు. దీంతో దక్షిణాదిలో రాజకీయంగా బలపడటానికి, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను బలహీన పరచటానికి బీజేపీ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తుంది.
తమిళనాడుపై గురి
2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెలుగుదేశం పార్టీలతో చివరి నిమిషంలో, కర్ణాటకలో జేడీఎస్ తోనూ పొత్తు పెట్టుకోవటం బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చింది. కాబట్టి, దక్షణ భార తంపై రాజకీయంగా పట్టు సాధించాలన్నా, కాంగ్రెస్ దాని బలమైన మిత్రపక్షం డీఎంకేని బలహీన పరచాలన్నా 39 లోక్‌సభ స్థానా లు ఉన్న పెద్ద రాష్ట్రమైన తమిళనాడుపై పట్టు సాధించాల్సి ఉంటుంది.
ఈ వ్యూహం లో భాగంగానే తన పాత మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో మరొకసారి భారతీయ జనతా పార్టీ పొత్తుకి సిద్ధమైంది. ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచిందనే చెప్పాలి. ద్రవిడ పార్టీల సహకారం లేకుండా తమిళనాడుపై పట్టు సాధించలేమని గత లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్, వామపక్ష పార్టీల కూటమిని ఎదుర్కొని పాగా వేయాలంటే అన్నా డీఎంకేతో పొత్తు అనివార్యమని భావించారు.
ఈ మేరకు అమిత్ షా తన రాజకీయ వ్యూహాలలో భాగంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. 2026లో తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలలో డీఎంకేని ఓడించడం ద్వారా 2029 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులో పట్టు సాధించాలనేది ఆ పార్టీ వ్యూహం వలె ఉన్నది. గత లోక్‌సభ ఎన్నికలలో 8 చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని అన్నామలై లాంటి యంగ్ లీడర్‌తో పోరాటం చేసినా ఒక్క లోక్‌సభ స్థానాన్ని కూడా గెలువలేక పోయింది.
కాబట్టి, లోక్‌సభలో ఐదవ అతిపెద్ద పార్టీగా ఉన్న డీఎంకేని, దక్షిణాది నుంచి కేంద్ర ప్రభుత్వం కంట్లో నలుసుగా మారిన ఎంకే స్టాలిన్‌ని దెబ్బ తీయటానికి షా రూ పొందించిన మంత్రాంగంగా పై పొత్తును భావిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి తమిళనాడులో అన్నా డీఎంకేని బలమైన పార్టీగా నిలుపగలిగారు.
2024 లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ ఒంటరిగా 23 శాతం ఓట్లను సాధించింది కనుకే అన్నా డీఎంకే, బీజేపీ జత కడితే రెండు పార్టీల బలం 41 శాతం అవుతుంది. ఈ రకంగా డీఎంకే కూటమికి బలమైన ప్రత్యర్థిగా నిలబడవచ్చన్నది షా అంచనా. పన్నీరు సెల్వం, దినకరన్ లాంటి వాళ్ళని కూడా తమవైపుకు తిప్పుకొని డీఎంకేకి గట్టి పోటీ ఇవ్వాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తుంది.
మరొకవైపు సినీ హీరో విజయ్ పార్టీ టీవీకే చీల్చే ఓట్లుకూడా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. తమిళనాడులో షా ఎత్తుగడతో డీఎంకే, కాంగ్రెస్‌లు కొంత ఆత్మరక్షణలో పడినట్లుగానే కనిపిస్తున్నది. కర్ణాటకలో జేడీ(ఎస్)తో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనలతో, తమిళనాడులో అన్నా డీఎంకేతో ఆయా రాష్ట్రాలలో పాగా వేసి, ప్రత్యర్థి పార్టీల దూకుడుకు కళ్లెం వెయ్యడమే బీజేపీ ‘ప్లాన్‌బి’గా కనిపిస్తున్నది.
అధ్యక్ష పదవి
దక్షిణాదిలో బలం పెంచుకోవడానికి ఇక్కడి రాష్ట్రాల నుంచి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలన్నది ఆ పార్టీ వేస్తున్న మరొక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలోనూ తమిళనాడు నుంచి జానా కృష్ణమూర్తి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెంకయ్య నాయుడు, తెలంగాణ నుంచి బంగారు లక్ష్మణ్ లాంటి వారు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పని చేశారు.
తమిళనాడు నుంచి అన్నామలై, తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధరేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో వినపడుతున్న పేర్లు. ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారిని ఎంపిక చేయటం ద్వారా తమది ఉత్తరాది పార్టీ మాత్రమే కాదు,
దక్షిణాదికి కూడా ప్రాధాన్యం ఇస్తుందనే సంకేతం ప్రజలలోకి పంపాలనేది పార్టీ వ్యూహం అంతరార్థంగా కనిపిస్తున్నది. రాబోయే లోక్‌సభ ఎన్నికల నాటికి దక్షిణాదిలో బలపడటానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఇష్టపడటం లేదు.
ఒక్కొక్క రాష్ట్రంలో పాగా
దేశంలో ఇప్పటికే బీజేపీ 16 రాష్ట్రాలలో, దాని మిత్రపక్షాలు ఆరు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో పార్టీ కొంత బలహీన పడినట్లుగా కనిపించినా లోక్‌సభ ఎన్నికల అనంతరం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే, ఇప్పటికే అధికారంలో ఉన్న హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలోనూ దానిని నిలబెట్టుకోవచ్చు.
ఇండియా కూటమిలోని ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని సొంతం చేసుకోవడం ద్వారా మరోసారి బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. మొత్తం మీద బీజేపీ చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నది. 2025 చివరిలో జరిగే బీహార్ శాసనసభ ఎన్ని కలలోనూ, 2026లో జరిగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసనసభ ఎన్నికలలోనూ గెలువడానికి బీజేపీ బలమైన వ్యూహాలనే సిద్ధం చేసుకుంటుంది.
121 లోక్‌సభ స్థానాలు గల ఈ మూడు పెద్ద రాష్ట్రాలలో గెలుపు సాధిస్తే (18వ లోక్‌సభ ఎన్నికలలో ఈ మూడు రాష్ట్రాల నుంచి పార్టీ గెలిచిన లోక్‌సభ స్థానాలు కేవలం 42 మాత్రమే) దేశంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. బీజేపీకి కలిసి వచ్చే అంశం ఆ పార్టీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాలలో దాని బలం చెక్కు చెదరటం లేదు.
ఇదే సమయంలో విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటి పూర్వపు బలాన్ని కోల్పోతున్నాయి. మరొక వైపు దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా (తెలంగాణ మినహాయిస్తే) కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకోలేక పోతున్నది. ఇది కూడా ఒకింత బీజేపీకి రాజకీయంగా కలిసివస్తున్నది. తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మమత బెనర్జీ, బీహార్‌లో తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్‌లే బీజేపీని కొంత ప్రతిఘటిస్తున్నారు.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో బీజేపీ రాజకీయ వ్యూహాలు ఫలిస్తే పార్టీ దేశంలో మరింత బలపడుతుంది. తమిళనాడులో ఆ పార్టీ అన్నా డీఎంకేతో పొత్తు ఆంధ్రప్రదేశ్‌లో లాగా విజయవంతమైతే దక్షిణాదిలో బీజేపీకి మరింత బలం పెరుగుతుంది.
దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో పార్టీ రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తే ఈ మొత్తం ప్రాంతంపై దానికి పట్టు చిక్కినట్లే అనుకోవాలి. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షా మంత్రాంగం ఫలించినట్లుగానే తమిళనాడులో కూడా ఫలిస్తుందో లేదో చూడాలి. ఇందుకు తమిళనాడు శాసనసభ ఎన్నికల వరకు వేచి ఉండాల్సిందే.
వ్యాసకర్త సెల్: 9885465877