- ప్రభుత్వ లక్ష్యం 36లక్షల టన్నులు
- ఇప్పటి వరకు 6.50లక్షల టన్నుల సేకరణ
- బోనస్ ఇస్తామన్నా సహకరించని రైతులు
- ‘ప్రైవేట్’ కొనుగోళ్లు తప్పవంటున్న అధికారులు
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వానికి సన్న రకం ధాన్యం సేకరణ సవాల్‌గా మారింది. జనవరి నుంచి పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని సర్కారు భావించిన సంగతి తెలిసిందే. కాగా వానకాలం సాగయిన సన్నవడ్లను సేకరించేందు కు పౌరసరఫరాల శాఖ కుస్తీ పడుతోంది.
ఈ సీజన్‌లో 45లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యం గా పెట్టుకోగా అనుకున్న స్థాయిలో సన్నధాన్యం సేకరణ జరగడం లేదు. అక్టోబర్ చివరి వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 16లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 6.50లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని సేకరించింది.
అయితే ప్రైవేట్ వ్యాపారులు ముందస్తు ఆలోచనతో గత నెలలోనే కల్లాల వద్దకెళ్లి కొర్రీలు పెట్టకుండా రైతుల నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. ప్రభుత్వం నవంబర్ రెండో వారం నుంచి సన్నవడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అప్పటికే సగానికి పైగా ధాన్యం ప్రైవేట్ వ్యాపారుల చెంతకు చేరింది.
ఇప్పటివరకు ప్రైవేట్ వ్యాపారులు సుమారు 20లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వానికి 25లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దొరకదని భావిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నాలు పంపిణీ చేయాలంటే 36లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కచ్చితంగా సేకరించాలి.
ఇప్పటివరకు అనుకున్న టార్గెట్‌లో పావు వంతు కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికే దాదాపు వరి కోతలు ముగియగా రైతులు వాటిని డిసెంబర్ రెండో వారంలోగా అమ్మే అవకాశం ఉన్నది. ఈ సమయంలోగా సన్నధాన్యం సేకరణ సాధ్యమేనా? అని అధికారులు సతమతమవుతున్నారు.
అయితే జనవరి నుంచి పంపిణీ చేయాలనుకున్న సన్నబియ్యం పంపిణీ.. ఉగాది తరువాత చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఆశించిన స్థాయిలో ధాన్యం సేకరణ జరగకపోతే రేషన్ ద్వారా సన్నాల పంపిణీ మరో మూడు నెలలు వాయిదా పడేలా ఉన్నది.
ఏటా 24లక్షల మెట్రిక్ టన్నులు పంపిణీ
రాష్ట్రంలో 89.99లక్షల కుటుంబాలకు ఆహారభద్రత కార్డులున్నాయి. 2.81కోట్ల లబ్ధిదారులకు నెలకు 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తుండగా.. ఏడాదికి 24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నది. ఇందుకోసం ప్రభుత్వం ముందుస్తుగా 36లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి సీఎంఆర్ చేసి మూడు నెలల పాటు గోదాంలలో ఉంచిన తరువాత రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తారు.
కాగా అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి రెండేళ్లుగా సన్నబియ్యం సరఫరా జరుగుతున్నది. గతేడాది సేకరించిన 18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విద్యార్థులకే సరిపోతున్నది.
‘ప్రైవేట్’ కొనుగోళ్లు తప్పవు!
ప్రభుత్వం ఆశించినంత సన్నధాన్యం సేకరణ జరగకుంటే ప్రైవేట్ వ్యాపారుల నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం పంపిణీ చేస్తామని, అందుకు తగిన ధాన్యం సేకరించాలని అధికారులను ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల పనిలో పడ్డారు.