- అన్ని వర్గాలను విస్మరించిన కాంగ్రెస్
- మీడియాపై దాడిని ఖండిస్తున్నాం
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాలు ఈనెల 9తో ముగియగా.. ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలతో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు విశ్రాంతి తీసుకుంటున్నట్టుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలకు ముందు వంద రోజులు టార్గెట్ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో తయారుచేసుకుందని.. ఇప్పుడు హామీల అమలును విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ.2,500 చొప్పున ఇప్పటివరకు రూ.30 వేల చొప్పున ఇవ్వాల్సి ఉందన్నారు.
ఈ విధంగా వృద్ధుల పింఛన్ రూ.4 వేల చొప్పున ప్రతి వృద్ధుడికి రూ.24 వేలు, నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి రూ.48వేలు బాకీ పడిందన్నారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 ఫిక్స్‌డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తే పోలీసులు జులుం చూపిస్తూ వారితో దారుణంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. మీడియాపై దాడులను ఖండిస్తున్నామన్నారు. విలేకరులపై జరిగిన దాడి విషయంలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.